Breaking News

ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టంపై ఆందోళనలు.. అమెరికా, బ్రిటన్‌లను తాకిన సెగ


పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసోంలో గురువారం నాటి నిరసనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. నిరవధిక కర్ఫ్యూ సైతం లెక్కచేయక ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. పోలీసులపై కూడా నిరసనకారులు రాళ్లు రువ్వడంతో గువహటి రణరంగాన్ని తలపించింది. శుక్రవారం సాయంత్రం కొంత ఉద్రిక్తతలు తగ్గడంతో శనివారం ఉదయం కర్ఫ్యూను తాత్కాలికంగా సడలించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత అసోంలో నిరసనల వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల తాజాగా సెగ విదేశీ పర్యాటకులను తాకింది. భారత్‌కు వెళ్లే తమ పౌరులకు అమెరికా, బ్రిటన్‌‌, కెనాడాలు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేశాయి. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయని బ్రిటన్ తన ట్రావెల్ అడ్వైజరీలో వెల్లడించింది. గువాహటిలో కర్ఫ్యూ విధించి, అసోంలోని కొన్ని జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారని, రవాణాకు కూడా అంతరాయం ఏర్పడిందని వివరించింది. ప్రయాణాలు అత్యవసరమైతే ఈశాన్య భారతానికి వెళ్లే బ్రిటన్‌ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక మీడియా నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని, అధికారుల సూచనలు పాటించాలని పేర్కొంది. అమెరికా, కెనడాలు సైతం ఇలాంటి సూచనలే చేసింది. అంతేకాదు, తమ అధికారుల అసోం పర్యటనలను తాత్కాలికంగా వాయిదావేసినట్లు అమెరికా వెల్లడించింది.


By December 14, 2019 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-uk-canada-issue-travel-advisories-due-to-northeast-protests-aganist-citizenship-amendment-act/articleshow/72586410.cms

No comments