Breaking News

Tabu బర్త్‌డే.. ఫస్ట్‌లుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన ‘అలవైకుంఠపురంలో’ టీం


దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు ప్రముఖ నటి టబు. తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు ‘అలవైకుంఠపురంలో’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈరోజు 48వ బర్త్‌డే. ఈ సందర్భంగా సినిమా టీం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అందమైన కళ్లు, చక్కని చిరునవ్వుతో ఫస్ట్‌లుక్‌లో టబు చాలా గార్జియస్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికీ ఆమె అందం ఇసుమంతైనా తగ్గలేదు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో నటీమణుల పాత్రకు వెయిట్ ఉంటుంది. మరి ఈ సినిమాలో టబు పాత్ర ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలకు విపరీతమైన స్పందన వస్తోంది. సౌత్ ఇండియాలో మోస్ట్ లైక్డ్ సాంగ్స్‌గా రికార్డ్‌ క్రియేట్ చేశాయి. తమన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ నటుడు సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక టబు విషయానికొస్తే ఆమె పూర్తి పేరు టబాస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్‌కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించారు. 1982లో వచ్చిన ‘బజార్’ అనే హిందీ సినిమాతో టబు తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1991లో వచ్చిన ‘కూలీ నెం 1’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో టబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘అందరివాడు’ తదితర చిత్రాల్లో నటించారు. టబు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.


By November 04, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/gorgeous-actress-tabu-celebrates-48th-birthday-alavaikuntapuramlo-team-shares-first-look-of-hers-in-film/articleshow/71885215.cms

No comments