మహారాజకీయాల్లో మరో ట్విస్ట్.. బీజేపీకి ఎన్‌సీపీ మద్దతు, సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్-ఎన్‌సీపీలతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు సఫలమైనట్టు కనిపించినా చివరిలో ఊహించని మలుపు తిరిగింది. అనూహ్యంగా బీజేపీకి మద్దతు తెలపడం, రెండోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. దీంతో మహారాష్ట్ర పీఠాన్ని అధిరోహించాలన్న శివసేన ఆశలు అడియాశలయ్యాయి. వాస్తవానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే పేరును ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రతిపాదించాయి. శివసేనకు సీఎం పదవి, కాంగ్రెస్, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించామని శరద్ పవార్ శుక్రవారం ప్రకటించారు. మంత్రి పదవులను 14-14-14 చొప్పున మూడు పార్టీలు పంచుకోవాలని నిర్ణయించాయి. ఈ మూడు పార్టీల ప్రతినిధులు శనివారం గవర్నర్‌ను కలిసి, అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా.. 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ-శివసేన కలిసి ఎన్నికల్లో బరిలో దిగగా.. ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. సీఎం పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామని శివసేన ప్రతిపాదించగా.. దీనికి బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. దీంతో శివసేన ఎన్‌డీఏ నుంచి వైదొలగి, కాంగ్రెస్-ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధమైంది. ఈ సమయంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ఎన్‌సీపీ ఊహించని షాక్ ఇచ్చింది.
By November 23, 2019 at 08:46AM
No comments