Breaking News

బీజేపీకి మద్దతు అజిత్ వ్యక్తిగతం.. అది ఎన్‌సీపీ నిర్ణయం కాదు: శరద్ పవార్


అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నామని ఎన్‌సీపీ అధినేత శరద్ పవరార్, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో మిత్రపక్షం శివసేనకు బీజేపీ భారీ షాక్‌ ఇచ్చింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని ప్రకటించి అంతలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బీజేపీకి మద్దతుపై స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను సంప్రదించి తీసుకున్న నిర్ణయం కాదని, ఇది వ్యక్తిగతమని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అయన నిర్ణయానికి తాము మద్దతు ఇవ్వడంలేదని, దీనిని ఆమోదించమని పవార్ స్పష్టం చేశారు. ఎన్‌సీపీని అజిత్ చీల్చారని, మెజార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ పరిణామాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకు శరద్ పవార్ రెండుసార్లు ఫోన్‌చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అజిత్ ద్రోహం చేశారని వివరించినట్టు సమాచారం. కాసేపట్లో శరద్ పవార్, ఠాక్రే మీడియా సమావేశం ఏర్పాటుచేస్తారని తెలుస్తోంది. రెండు రోజుల కింద ప్రధాని మోదీతో పవార్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధానితో భేటీ సందర్భంగా కేవలం రైతు సమస్యల గురించి మాత్రమే చర్చించామని శరద్ పవార్ ప్రకటించారు. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్‌ అధినేత్రితో భేటీ అయిన పవార్.. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశంలోనే శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై కాంగ్రెస్- ఎన్‌సీపీలు ఓ అవగాహనకు వచ్చాయి. గురువారం రాత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ప్రత్యేకంగా సమావేశమైన శరద్ పవార్.. ఆయనను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని సూచించారు. మరి అంతలోనే బీజేపీకి అజిత్ మద్దతు పలకడంతో ఆయన కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఉదయం 7 గంటలకు ఈ విషయం తెలిసిందని పవార్ అన్నారు. మరోవైపు, సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం వారు కృషి చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడటంతో రాష్ట్రపతి పాలను ఎత్తేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 5.30 గంటలకు సీఎంగా దేవేందర్ ఫడ్రవీస్ ప్రమాణస్వీకారం చేయగా, సరిగ్గా 15 నిమిషాలకే రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.


By November 23, 2019 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ajit-pawars-decision-to-support-bjp-his-personal-and-not-that-of-the-ncp-sharad-pawar/articleshow/72194122.cms

No comments