YSR Vahana Mitra: ఆటోలపై స్టిక్కర్లు.. జగన్ సర్కారుపై టీడీపీ ట్రోలింగ్
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోన్న జగన్ సర్కారు.. ఇటీవలే వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా సొంత ఆటో, ట్యాక్సీలు ఉన్నవారికి జగన్ రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. అర్హత ఉండీ అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి ప్రయోజనం చేకూర్చడం కోసం అక్టోబర్ చివరి వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్న జగన్.. సంక్షేమ పథకాల అమలులో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. కానీ వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన తర్వాత.. ఏపీలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఆటోలను ఆపి మరీ ‘వాహనమిత్ర’ ఇచ్చినందుకు థ్యాంక్యూ అన్నట్టుగా జగన్, వైఎస్ ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అతికించడం వివాదాస్పదం అవుతోంది. యూనిఫాంలో ఉన్న పోలీసులు ఆటోలను ఆపి మరీ స్టిక్కర్లు అతికించడం ఏంటని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఆటోవాలాలకు లబ్ధి చేకూరిందా? లేదా? అనే దానితో నిమిత్తం లేకుండా.. స్టిక్కర్లను అతికించారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే థ్యాంక్యూ సీఎం స్టిక్కర్లను ఆటోల వెనుక అతికించారు. తుఫాను సహాయక చర్యలు చేపట్టిన తర్వాత థ్యాంక్యూ సీఎం పేరిట పెద్ద పెద్ద హోర్డింగులే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆటోల మీద స్టిక్కర్లను అతికించడం చూస్తుంటే.. జగన్ కూడా పబ్లిసిటీ కోరుకుంటున్నారేమో అనిపిస్తోంది. మీడియాలో ఫోకస్ కావడానికి జగన్ పెద్దగా ఇష్టపడరు. తన పనిని తాను సైలెంట్‌గా చేసుకుపోతారు. ప్రజలకు మేలు కలిగితే చాలని భావిస్తారు. ప్రత్యర్థుల విమర్శలపైనా.. ఆయన పెద్దగా స్పందించరు. కానీ వాహనమిత్ర స్టిక్కర్లను యూనిఫాంలో ఉన్న సిబ్బందే ఆటోలపై అతికిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
By October 08, 2019 at 08:43AM
No comments