Sarileru Neekevvaru: ‘మహేశ్‌కు నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు’
సూపర్‌స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేశ్‌కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తు్న్నారు. అయితే ఈ సినిమాకు గానూ మహేశ్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడంతో తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మహేశ్ రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నారని అంటున్నారు. అయితే అందులో వాస్తవం లేదని సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అనిల్ సుంకర మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఈ సినిమాలో మహేశ్‌కు కూడా వాటా ఉండటం వల్ల ఆయన ఇంతవరకు ఒక్క రూపాయి తీసుకోలేదని తెలిపారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే భారీ వాటాను పారితోషికంగా తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ సినిమాకు అనిల్ సుంకరతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విషయంలో అనిల్‌కు దిల్ రాజుకు మధ్య విభేదాలు వచ్చాయని వదంతులు వినిపించాయి. దీనిపై కూడా అనిల్ ఓ క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు తనకు చాలా క్లోజ్ అని తెలిపారు. సినిమా ప్రొడక్షన్ క్రెడిట్స్‌లో దిల్ రాజుకు కూడా షేర్ ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సినిమాలో మహేశ్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. దసరా సందర్భంగా చిత్రబృందం సోమవారం సినిమాకు సంబంధించిన సూపర్ పోస్టర్‌ను విడుదల చేసింది. కొండారెడ్డి బురుజు ముందు మహేశ్ గొడ్డలి పట్టుకుని నిలబడిన స్టిల్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా వెల్లడించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నటి పూజా హెగ్దే మహేష్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే మహేశ్ వరుసగా హ్యాట్రిక్ కొట్టినట్లే.
By October 08, 2019 at 12:33PM
No comments