RTC ప్రక్షాళన తర్వాత కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..?
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని కుండబద్ధలు కొట్టిన కేసీఆర్.. సంస్థను ప్రయివేట్ పరం చేయబోమని స్పష్టం చేశారు. రవాణా సంస్థను మూడు రకాలుగా విభజిస్తామన్నారు. 50 శాతం ప్రయివేట్ బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, మరో 20 శాతం ప్రయివేట్ బస్సులు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. పండుగ సీజన్లో సమ్మెకు వెళ్లిన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం.. ఆర్టీసీ ఉద్యోగులు తమంట తామే ఉద్యోగాలను పోగొట్టుకున్నట్టేనన్నారు. దీంతో 48 వేల మందికిపైగా ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలను కోల్పోయినట్టయ్యింది. మొదటి టర్మ్‌లో ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇచ్చిన కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చాక కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2015లో ఆర్టీసీ సిబ్బంది అడిగిన దాని కంటే ఎక్కువగా 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ససేమీరా అంటున్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు, సంస్థను సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం ఇప్పటికే కేసీఆర్ ఫిక్స్ అయ్యారని.. ఇక ఎవరి మాట వినేందుకు సిద్ధంగా లేరని ఆయన తీరును చూస్తే అర్థం అవుతోంది. ఆర్టీసీ సమస్యను చక్కదిద్దాక.. కేసీఆర్ తమను ఎక్కడ టార్గెట్ చేస్తారేమోనని మిగతా ఉద్యోగులు భయపడుతున్నారు. కేసీఆర్ తదుపరి టార్గెట్ రెవిన్యూ విభాగం, వీఆర్వోలేనని భావిస్తున్నారు. వీఆర్వోల వ్యవస్థపై సీఎం అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవిన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్వోలపై కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుక్క తోకను ఊపాలి కానీ.. తోక కుక్కను ఊపొద్దంటూ ఉద్యోగులను, ముఖ్యంగా వీఆర్వోలను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. రెవిన్యూ విభాగం పేరును భూమాతగా మార్చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆర్టీసీ సమస్య ఓ కొలిక్కి వచ్చాక.. కేసీఆర్ రెవిన్యూ విభాగం, వీఆర్వోలపై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా మున్సిపల్ సిబ్బంది కూడా సీఎం షాకిచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రజలకు మేలు చేకూర్చడం కోసం, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
By October 08, 2019 at 07:31AM
No comments