Medchal: చేతబడి అనుమానంతో యువకుడి దారుణహత్య
చేస్తున్నాడన్న నెపంతో ఓ యువకుడిని హత్యచేసి దహనం చేసిన దారుణ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా మండలం అద్రాసుపల్లికి చెందిన గ్యార లక్ష్మి అనే మహిళ ఆరేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆమె కోలుకోవడం లేదు. చేతబడి చేయడం వల్లే లక్ష్మికి అనారోగ్యం తగ్గడం లేదని కొందరు స్థానికులు కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో అదే గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు(24) అనే యువకుడిపై వారికి అనుమానం కలిగింది. కుటుంబ తగాదాలతో అతడే లక్ష్మిపై చేతబడి చేసి ఉంటాడని బలంగా నమ్మారు. ఈ క్రమంలోనే లక్ష్మి బుధవారం ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. అందరూ ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఆంజనేయులు వారి కంటపడ్డాడు. దీంతో శ్మశానంలో చేతబడి చేసేందుకు వెళ్తున్నాడని పొరబడిన లక్ష్మి కుటుంబసభ్యులు, బంధువులు అతడిపై దాడికి పాల్పడ్డారు. గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపేశారు. లక్ష్మిని దహనం చేసిన చోటే అతడి మృతదేహంపై కట్టెలు పేర్చి దహనం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సగం కాలిన ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పికెట్ ఏర్పాటుచేశారు. మరోవైపు ఆంజనేయులుపై గతంలోనూ అనేకసార్లు చేతబడి ఆరోపణలు వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
By September 19, 2019 at 10:47AM
No comments