Breaking News

Hyderabad: 1800కి.మీ ప్రయాణించి దొంగలను పట్టుకున్న పోలీసులు


నగల షాపులో దొంగతనం చేసి పారిపోయిన బిహార్ ముఠాను రాచకొండ పోలీసులు ఏకంగా 1800 కిలోమీటర్లు ప్రయాణించి పట్టుకున్న ఘటన ఇటీవల చోటుచేసుకుంది. దొంగల కోసం సుదీర్ఘంగా వేట కొనసాగించిన పోలీసులు బిహార్ పోలీసుల సాయంతో సనీఫక్కీలో వారిని వేటాడి పట్టుకున్నారు. తెలంగాణ పోలీసుల పనితీరుకు అద్దంపట్టే ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏఎస్‌రావునగర్‌లో ప్రధాన మార్గంలో గల వినాయక జ్యుయెలర్స్‌లో బుధవారం రాత్రి దొంగలు గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు. జ్యుయెలరీ యజమాని తన దుకాణంలో సీసీ కెమెరాలతో పాటు అలారం సిస్టమ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆయన మొబైల్‌లో అలారం మోగడంతో ఆయన వెంటనే సెల్‌ఫోన్‌లోనే సీసీ కెమరాలు ఓపెన్ చేసి చూశాడు. అయితే దొంగలు సీసీ కెమెరాల వైర్లు కట్ చేయడంతో ఆయనకు అనమానమొచ్చి వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే షాపు వద్దకు చేరుకునే సరికే దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వారు పారిపోయే క్రమంలో కొన్ని బ్యాగులను అక్కడే వదిలి వెళ్లిపోయారు. దొంగల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆ ముఠాలో నలుగురు గురువారం సికింద్రాబాద్-దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. వారు ఎస్9 బోగీలో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఇతర వాహనాల్లో రైలును వెంబడించారు. మార్గమధ్యలోనే బిహార్ రైల్వే పోలీసులతో సమన్వయం చేసుకుంటూ తాము వెంబడిస్తున్నట్లు ఎక్కడా దొంగలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మార్గమధ్యలో కొందరు పోలీసులు అదే రైలెక్కి ఆ నలుగురిని వెంబడించారు. రైలు చివరి స్టేషన్ దానాపూర్‌ చేరుకోగా ఎస్9 బోగీలో ఉన్న నలుగురు దొంగలను అరెస్ట్ చేశారు. ఈ చోరీలో మొత్తం 12 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో కీలకపాత్ర పోషించిన మంజూర్ ఆలం, మో ఖాసింతో పాటు బిహార్‌లోని అరారియా జిల్లా కతిహాల్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు హైదరాబాద్‌లోనే ఉన్నారా? లేక రాష్ట్రం విడిచి వెళ్లిపోయారా? అన్న కోణంలో గాలింపు చేపట్టారు.


By September 08, 2019 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-police-traveled-1800-km-for-caught-the-bihar-robbers-gang/articleshow/71031412.cms

No comments