Engineer's Day: మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా.. విశాఖ రేవును కాపాడిందిలా..
ప్రపంచం గర్వించదగిన ఇంజినీర్ జయంతి నేడు. 1861 సెప్టెంబర్ 15న చిక్కబళ్లాపుర తాలూకాలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఆయన జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ 15న జరుపుకొంటున్నాం. విశ్వేశ్వరయ్య పూర్వీకులు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. ఆయన ప్రాథమిక విద్య చిక్‌బల్లాపూర్‌లో పూర్తి చేశారు. 15వ ఏట తండ్రిని కోల్పోయిన విశ్వేశ్వరయ్య.. మేనమామ రామయ్య ప్రోత్సాహంతో చదువుకున్నారు. ఉపకార వేతనంతో పుణేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య.. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఏడాది వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. విశ్వేశ్వరయ్య పనితీరు అద్భుతంగా ఉండటంతో.. సుక్నూర్‌బరాజ్ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమితులయ్యారు. సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేయడంలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు. 1909లో మైసూర్ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను చీఫ్ ఇంజనీర్‌గా నియమించింది. మైసూర్ సమీపంలో నిర్మించిన కృష్ణరాజ సాగర్ ఆనకట్టకు ఆయనే చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరించారు. 1900ల్లో మూసీ నదికి వచ్చిన వరదల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యేది. మూసీ వరదల బారి నుంచి భాగ్యనగరాన్ని రక్షించే బాధ్యతలను నిజాం నవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. విశ్వేశ్వరయ్య ఆలోచనల ప్రకారమే.. మూసీపై ఎగువన రిజర్వాయర్లు నిర్మించారు. జలాశయాల నిర్మాణంతో భాగ్యనగరికి వరద ముప్పు తప్పింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్‌లు ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నిజాం నవాబు విన్నపం మేరకు హైదరాబాద్‌కు మురుగునీటి పారుదల వ్యవస్థను ఆయనే రూపొందించారు. విశాఖపట్నం ఓడ రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు. విశాఖ రేవును నిర్మాణ సమయంలో అలల పోటు ఎక్కువగా ఉండేది. అలల తీవ్రతను తగ్గించడం కోసం ఆయన ఆయన ఓ సలహా ఇచ్చారు. రెండు పాత నౌకల్లో బండరాళ్లు వేసి సాగర తీరానికి చేరువగా ముంచేయాలని సూచించారు. అలా చేయడం వల్ల అలల తీవ్రత తగ్గింది. కొన్నాళ్ల తర్వాత కాంక్రీటుతో బ్రేక్ వాటర్స్ నిర్మించారు. తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాటు కోసమూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి చేశారు. ఇంజినీర్‌గా, మైసూర్ దివాన్‌గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1955లో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందజేసింది.
By September 15, 2019 at 09:14AM
No comments