కశ్మీర్ సమస్య.. అమెరికాకు కీలెరిగి వాత పెట్టిన పీవీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్నారు. నేడు (శనివారం) హౌడీ మోడీ పేరిట టెక్సాలో భారీ సభను నిర్వహిస్తున్నారు. ఐరాసలో కశ్మీర్ అంశాన్ని, ఆర్టికల్ 370 రద్దును మోదీ ప్రస్తావించనున్నారు. కశ్మీర్ సమస్యకు చెక్ పెట్టడం కోసం, రాజకీయ, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం మోదీ టెక్సాస్‌లో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో 1994లో భారత ప్రధాని అమెరికా పర్యటనను ప్రస్తావనార్హం. 1990లో భారత్ ఆర్థిక సంస్కరణలకు తెర తీసింది. కానీ అదే సమయంలో కశ్మీర్ సమస్య తీవ్రమైంది. అప్పట్లో పాకిస్థాన్‌కు అమెరికా మిత్రదేశం. దీంతో భారత్‌ను అమెరికా ఇబ్బంది పెట్టేది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అమెరికా ఆరోపించేది. దీంతో 1994లో అమెరికాలో పర్యటించిన పీవీ నరసింహారావు.. మే 18న అమెరికా చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్ సమస్య విషయమై ఆయన తెలివిగా మాట్లాడారు. ఎలా అమెరికాలో భాగమో.. కశ్మీర్ కూడా అలాగే భారత్‌లో భాగమని ఆయన స్పష్టం చేశారు. మెక్సికోలో భాగంగా ఉన్న టెక్సాస్ తర్వాత స్వతంత్ర దేశంగా మారి.. అమెరికాలో ఎలా చేరిందో.. కశ్మీర్ కూడా అలాగే భారత్‌లో చేరిందని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘‘టెక్సాస్ అమెరికాలో అంతర్భాగం, ఈ ప్రాంతం అమెరికాలో చేరిన నాటి నుంచే విడదీయరాని భాగంగా మారిందని 1868లో అమెరికా సుప్రీం కోర్టు ప్రకటించింది. భారత్ ఈ ప్రకటనను అంగీకరిస్తుంది. అలాగే కశ్మీర్ కూడా భారత్‌లో భాగమైంది. మానవ హక్కులను కాపాడతాం. ఉగ్రవాదుల నుంచి తన ప్రజలను భారత్ కాపాడుకుంటుంది’’ అని పీవీ నరసింహారావు ప్రసంగించారు. పీవీ ఈ మాటలు అనగానే అమెరికా చట్టసభ సభ్యుల కరతాళ ధ్వనులతో సభ మార్మోగింది. టెక్సాస్ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కశ్మీర్ విషయంలో అమెరికా దూకుడుగా ముందుకెళ్లకుండా పీవీ అడ్డుకున్నారు. ఇప్పుడు అదే టెక్సాస్ ప్రాంతంలో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తూ.. కశ్మీర్ సమస్య గురించి మాట్లాడుతున్న వారికి మరోసారి టెక్సాస్ అంశాన్ని గుర్తు చేస్తున్నారు.
By September 22, 2019 at 09:29AM
No comments