భారత్ తమ దేశంలో ఉగ్రవాదానికి పాల్పడుతోంది.. దొంగే దొంగ దొంగ అన్నట్టుంది పాక్ వాదన!
‘పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది’ అన్న చందంగా ఉంది పాక్ యవ్వారం. తన భూభాగంపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనేది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో అన్ని వేళ్లూ పాక్‌వైపే చూపిస్తుంటే, దాయాది మాత్రం ఆ పాపాన్ని మనకు అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను భారత్ ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. కశ్మీర్‌పై తాము చేస్తున్న ప్రచారానికి ప్రతీకారంగా తన సంస్థల సాయంతో ఉగ్రవాద చర్యలను భారత్ ప్రోత్సహిస్తోందంటూ ఓ నివేదికను గతవారం భారత హైకమిషన్‌కు అందజేసినట్టు సమాచారం. అయితే, ఈ నివేదికను భారత అధికారులు ఖండించారు. దురుద్దేశపూరితంగానే తమకు ఉగ్రవాదాన్ని ఆపాదిస్తోందని తోసిపుచ్చారు. అయితే, ఈ నివేదికలతో రెచ్చగొట్టడం వెనుక ఆంతర్యం ఏంటో స్పష్టంగా తెలియకపోయినా కానీ, తప్పుడు ప్రచారం ద్వారా దృష్టిమరల్చే ప్రయత్నమేనని అంటున్నారు. దేశంలోకి ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు సహా పలు కారణాలు దీని వెనుక ఉన్నట్టు అవతగమవుతోందని భారత అధికారులు వ్యాఖ్యానించారు. విషయంలో భారత్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా తప్పుడు ప్రతాలను సృష్టించిందని పేర్కొంటున్నారు. అంతేకాదు, కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రత్యేక ఖలీస్థాన్ అనుకూల ఉద్యమానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని అనుమానిస్తున్నారు. కర్తార్‌పూర్ కారిడార్‌పై తుది నిర్ణయానికి రాకపోవడానికి యాత్రికులతోపాటు భారత కాన్సులేట్ అధికారులకు పాక్ అనుమతి నిరాకరించడమే కారణమని తెలిపారు. ఈ సమావేశంలోనే పాక్ తన నివేదికను భారత అధికారులకు అందజేయడం గమనార్హం. కాగా, కశ్మీర్ అంశాన్ని మరోసారి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్, సాధారణ సభ సహా పలు అంతర్జాతీయ వేదికలపై చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే పాక్ ఈ నివేదిక రూపొందించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో భారత్ అణచివేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపిస్తూ ఐరాస మానవహక్కుల కమిషన్‌లో తీర్మానం కూడా ప్రవేశపెట్టడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. దీంతో యూఎన్‌హెచ్ఆర్సీ సభ్యదేశాల మద్దతును కూడగట్టేందుకు విదేశాంగ మంత్రి జయశంకర్ రంగంలోకి దిగారు. జమ్మూ కశ్మీర్ లేదా దేశంలో మరెక్కడైనా ఉగ్రదాడి జరిగితే తమను వేలెత్తి చూపకుండా ఉండేందుకే పాక్ ఈ కొత్త ఎత్తుగడ వేసినట్టు అర్థమవుతోంది. తప్పుడు ప్రచారంతో తమపై అనవసరంగా నిందలు వేస్తున్నారని పాకిస్థాన్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలతో దీనికి సంబంధం ఉందా అనే కోణంలో భారత్ చూస్తోంది. కశ్మీర్‌లో యథేచ్చగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోన్న భారత్, బూటకపు ఆపరేషన్‌లతో దృష్టిని మరల్చేందుకు ఉగ్రవాదం అనే ప్రచారం చేస్తోందిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆగస్టు 23 ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉగ్రదాడికి సాయం చేస్తే ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో శాశ్వతంగా ఉండిపోయే అవకాశం ఉందని విషయం పాక్‌కు తెలుసని, దాని దృష్టి మరల్చడానికే ఈ నివేదిక రూపొందించిందని అధికార వర్గాలు అంటున్నాయి.
By September 09, 2019 at 12:49PM
No comments