నేటి అర్థరాత్రి జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్.. ఆ పావుగంటే కీలకం!
చందమామపై భారత కీర్తిపతాక రెపరెపలాడే సమయం ఆసన్నమైంది. భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన మరి కొద్ది గంటల్లో తన లక్ష్యాన్ని చేరుకోనుంది. చంద్రయాన్-2 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం ఒక ఎత్తైతే, చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టడానికి ముందు 15 నిమిషాలు ఒక ఎత్తు. ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దిగే క్రమంలో శాస్త్రవేత్తలు ‘విక్రమ్’ ల్యాండర్‌కు సంకేతాలు పంపుతారు. అంతా సవ్యంగా ఉందని నిర్ణయానికి వచ్చాక 78 నిమిషాల అనంతరం ల్యాండర్‌ను ఉపరితలంపై దింపడానికి ఆదేశాలు పంపనున్నారు. ఆ సమయంలో ల్యాండర్ వేగం 6,120 కిలోమీటర్లు ఉండగా.. జాబిల్లికి 35×100 కిలోమీటర్ల కక్ష్యలో ఉంటుంది. ఇస్రో నుంచి సంకేతాలు అందగానే ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు మండటం ఆరంభిస్తాయి. ఇవి ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. అనంతరం ల్యాండర్ కిందకు దిగడం మొదలవుతుంది. చంద్రుడిపై విక్రమ్ దిగే సమయానికి అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో ఈ వ్యోమనౌక తన సోలార్ ఫలకాల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. భూ కేంద్రంతో నేరుగా హై బ్యాండ్‌విడ్త్ లింక్‌ను ఏర్పాటు చేసుకొని సంభాషిస్తుంది. తన పరిధిలోకి వచ్చినప్పుడల్లా ఆర్బిటర్‌తోనూ కమ్యూనికేషన్ సాగిస్తుంది. తొలుత ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్ పనితీరును పరిశీలించిన అనంతరం చంద్రుడి ఉపరితల కార్యకలాపాలు మొదలవుతాయి. విక్రమ్ ల్యాండింగ్ సమయంలో పైకి లేచే చంద్రుడిపై ధూళి నాలుగు గంటల తర్వాత సర్దుకుంటుంది. అప్పుడు ల్యాండర్ నుంచి ర్యాంప్ విచ్చుకోగా, దాని మీద నుంచి ‘ప్రజ్ఞాన్’ రోవర్ కిందకు దిగుతుంది. అయితే, ఈ రోవర్ నేరుగా భూ కేంద్రంతో అనుసంధానించలేదు. ఆర్బిటర్‌తో మాత్రమే కమ్యూనికేషన్ సాగిస్తుంది. ఈ రోవర్‌పై భారత జాతీయ పతాకాన్ని, ఇస్రో లోగోను చిత్రీకరించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి 350 కిలోమీటర్ల ఉత్తరాన మాంజినస్ సి, సింపెలియస్ ఎన్ అనే రెండు బిలాల మధ్య ప్రాంతంలో ల్యాండర్ దిగనుంది. విక్రమ్ 100 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు కొన్ని సెకన్ల పాటు అక్కడ తిరుగాడుతుంది. ల్యాండింగ్ సైట్‌లో 500 మీ x 500 మీ, 1.6 కిలోమీటర్ల పరిధిలో రెండు జోన్లను గుర్తించిన శాస్త్రవేత్తలు, తొలి జోన్‌లోనే ల్యాండర్‌ను దింపాలని నిర్ణయించారు. ఇక, జపాన్‌కు చెందిన కగుయా ఆర్బిటర్, అమెరికాకు చెందిన ఎల్‌ఆర్‌వో ఆర్బిటర్లు అందించిన చిత్రాలు, డేటాను విశ్లేషించిన ఇస్రో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ప్రాథమిక, బ్యాకప్ సైట్ రెండూ ల్యాండింగ్ రోజున సూర్యకిరణాలు ఆరు డిగ్రీల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయని ఇస్రో భావిస్తోంది. దీని వల్ల చంద్రుడి గురించి ఫోటోలను తీయడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం నుంచే ల్యాండర్ తన ల్యాండింగ్ సైట్ చిత్రాలను తీస్తోంది. ప్రాథమికంగా ఎంపికచేసిన జోన్‌లో ల్యాండర్ దిగగలిగితే విక్రమ్ నేరుగా 65 సెకన్లలో 10 మీ ఎత్తుకు చేరుకుంటుంది. ఒకవేళ రెండో ల్యాండింగ్ సైట్‌ను ఎంచుకుంటే తొలుత 60 మీటర్లు కిందకు దిగడానికి 40 సెకన్లు పడుతుంది. తర్వాత 25 సెకన్లలో 10 మీ ఎత్తుకు చేరుకుంటుందని శాస్త్రవేత్త వివరించారు. 10 మీటర్లకు చేరుకున్న తర్వాత ఉపరితలంపై దిగేందుకు 13 సెకన్లు పడుతుంది. అమెరికాకు చెందిన అపోలో-16, సర్వేయర్-7లు మాత్రమే ఇప్పటివరకూ ఎగువ మైదాన ప్రాంతాల్లో దిగాయి. మిగతా వ్యోమనౌకలన్నీ చీకటిమయంగా ఉండే, నున్నగా ఉండే లావా మైదాన ప్రాంతాల్లో కాలుమోపాయి. చంద్రయాన్-2 కాలుమోపుతున్న దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో వ్యోమనౌకలేవీ ఇప్పటివరకూ దిగలేదు.
By September 06, 2019 at 08:03AM
No comments