Breaking News

నేను, నా తమ్ముడు అందుకే ఓడాం.. రాజకీయాల్లోకి వద్దు: రజినీ, కమల్‌కు చిరు సూచన


సున్నితమైన మనస్తత్వం కలిగినవారికి రాజకీయాలు సరిపడవని సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వీళ్లిద్దరూ రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇచ్చారు. తనను, తన తమ్ముడిని చూసైనా వారు రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చారు. ఈ మేరకు ప్రముఖ తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించారు. రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘సినిమా కెరీర్‌లో నేను నంబర్ వన్‌గా ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. కానీ, ప్రస్తుతం రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. నా ప్రత్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరించి నా సొంత నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరిగింది. డబ్బు, కులం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి’’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరవాత ఓటమి, నిరుత్సాహం, అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చిరంజీవి అన్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ కచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంటే గనుకు ఎన్నో సవాళ్లను, నిరాశ నిస్పృహలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నిజానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ గెలుస్తుందని తాను భావించానని, కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదని చిరంజీవి అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయలేదు కానీ, ఆయన పార్టీ మక్కల్ నీధి మయ్యం పోటీ చేసింది. అయితే, ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు కానీ, ఇంకా పార్టీ పెట్టలేదు. త్వరలోనే ఆయన కూడా తన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలూ చేస్తున్నారు. కానీ, వీరిద్దరినీ రాజకీయాల్లోకి రావద్దని చిరంజీవి వారిస్తున్నారు. చిరంజీవి 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి మరీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేసింది. అయితే, మొత్తం 294 సీట్లలో కేవలం 18 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీచేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడారు.


By September 27, 2019 at 11:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/stay-out-of-politics-sye-raa-star-chiranjeevi-tells-rajinikanth-kamal-haasan/articleshow/71324243.cms

No comments