రాష్ట్రపతి కోవింద్ విమానానికి అనుమతి నిరాకరించిన పాకిస్థాన్!
రాష్ట్రపతి మూడు దేశాల పర్యటనకు సోమవారం బయలుదేరనున్నారు. ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియాలో సెప్టెంబరు 17 వరకు ఆయన పర్యటించనున్నారు. అయితే, కోవింద్ ప్రయాణించే విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి అనుమతి నిరాకరించింది. దీంతో వేరే మార్గంలో రాష్ట్రపతి అక్కడకు చేరుకుని పర్యటన ముగిసిన తర్వాత అలాగే తిరిగొస్తారు. పాకిస్థాన్ మీడియా కథనం ప్రకారం.. తమ గగనతలం మీదుగా ప్రత్యేక విమానాలు అనుమతించరాదని ప్రధాని నిర్ణయం తీసుకున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తమ అధికారిక టీవీ ద్వారా వెల్లడించారని పేర్కొంది. షెడ్యూల్ విమానాలకు అన్ని దేశాలు ముందుగానే క్లియరెన్స్ ఇస్తాయి. కానీ, ప్రత్యేక విమానాలు, చార్టర్స్ ఫ్లయిట్స్ విదేశాల గగనతలం మీదుగా ప్రయాణించాలంటే మాత్రం దౌత్యపరమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రపతి విమానం ప్రయాణించడానికి భారత్ అనుమతి కోరినా పాకిస్థాన్ తోసిపుచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పాక్ మీదుగా కాకుండా వేరే మార్గంలో ఐరోపా చేరుకోవాలంటే అదనంగా 50 నిమిషాలు సమయం పడుతుంది. ఢిల్లీ నుంచి ముంబైలోని అరేబియా సముద్రం మీదుగా మస్కట్ అక్కడ నుంచి ఐరోపా చేరుకుంటారు. ఒకవేళ పాక్ తన గగనతలం మీదుగా ప్రయాణానికి అనుమతిస్తే ఢిల్లీ- పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, ఐరాన్ నుంచి ఐరోపా ఖండంలోకి ప్రవేశించవచ్చు. బాలాకోట్‌పై భారత్ వైమానిక దాడుల అనంతరం పాక్ తన గగనతలాన్ని మూసివేసి తిరిగి జులై 16న 138 రోజుల తర్వాత తెరిచింది. ఈ సమయంలో ఢిల్లీ నుంచి పశ్చిమ దేశాలకు విమానాలు ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగించేవి. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బిష్‌కేక్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఈ మార్గంలోనే ప్రయాణించారు. ఒకవేళ ఆయన పాక్ మీదుగా ప్రయాణించి ఉంటే 3.45 గంటల్లో అక్కడకు చేరుకునేవారు. కానీ అదనంగా దాదాపు 3 వేల కిలోమీటర్ల ప్రయాణించాల్సి రావడంతో 6.30 గంటలు పట్టింది. ఢిల్లీ నుంచి గుజరాత్- ఆరేబియా సముద్రం-ఇరాన్ మధ్య ఆసియా- బిష్‌కేక్ చేరుకోడానికి 2,890 కిలోమీటర్లు దూరం అదనంగా జర్నీ చేశారు.
By September 08, 2019 at 01:46PM
No comments