పసివాడి ప్రాణం తీసిన పాలగిన్నె.. శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం
శుభకార్యం కోసం కుటుంబ సభ్యులు సన్నద్ధం అవుతున్న వేళ.. ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి వేడి పాల గిన్నెలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాడిపత్రి నియోజకవర్గంలోని సుంకులమ్మ కాలనీకి చెందిన లోకేశ్వరయ్య, చంద్రిక దంపతులకు ఇద్దరు కుమారులు. దేవాన్ష్ వీరిలో చిన్నవాడు. ఆదివారం లోకేశ్వరయ్య ఇంట్లో శుభకార్యం ఉంది. దీంతో అతిథులకు పెరుగు కోసం శనివారం రాత్రి పాలను వేడి చేశారు. పెద్ద గిన్నెలో పోసి చల్లార్చేందుకు ఫ్యాన్ కింద ఉంచారు. ఆడుకుంటూ వెళ్లిన దేవాన్ష్ ఆ గిన్నెలో పడిపోయాడు. పాలు వేడిగా ఉండటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చిన్నారి ఏడుస్తుండటంతో వెంటనే పాల గిన్నె నుంచి బయటకు తీసిన కుటుంబ సభ్యులు.. చికిత్స కోసం అనంతపురంలోని హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకెళ్తుండగా.. దేవాన్ష్ దార్లోనే ప్రాణాలు వదిలాడు. శుభకార్యం జరగాల్సిన ఇంట ఇలా జరగడంతో.. గ్రామంలో విషాదం అలుముకుంది. అప్పటి వరకు బుడి బుడి అడుగులతో తమను అలరించిన చిన్నారి ఇక లేడనే విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
By September 09, 2019 at 11:47AM
No comments