Breaking News

పప్పులో కాలేసిన పాక్ ప్రధాని.. జాగ్రఫీయే కాదు లెక్కల్లోనూ వీకేనంటూ జోకులు!


కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న తనను తాను ఎక్కువగా ఊహించుకుంటోంది. ఆ దేశ ప్రధాని మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితులేంటో తెలుసుకోకుండా ఆయన నేలవిడిచి సాము చేస్తున్నారు. కశ్మీర్ అంశంలో ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఉత్తుత్తి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇలాంటి ప్రకటనలతో అంతర్జాతీయ సమాజం పాక్‌పై మరింతగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్‌లోని 58 దేశాలు తమకు మద్దతు ఇచ్చాయంటూ ప్రకటించారు. అయితే, యూఎన్‌హెచ్‌ఆర్సీలో ఎంత మంది సభ్యులు ఉంటారో ముందు తెలుసుకుని మాట్లాడాలని, ఇమ్రాన్‌కు జాగ్రఫీ మాత్రమే కాదు లెక్కలు కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని చలోక్తులు విసురుతున్నారు. ‘కశ్మీరీల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం బలప్రయోగాన్ని నిలిపివేసి, ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తాము ప్రవేశపెట్టిన భద్రతా మండలి తీర్మానానికి ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో మద్దతు తెలిపిన 58 దేశాలను అభినందిస్తున్నాను’అంటూ ట్వీట్ చేశారు. అయితే, యూఎన్‌హెచ్ఆర్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో సభ్యుల సంఖ్యను పేర్కొంది. ఐరాస సాధారణ అసెంబ్లీలోని 47 దేశాలు యూఎన్‌హెచ్ఆర్సీలో సభ్యులుగా ఉన్నాయని, ఐరాస మానవహక్కుల కమిషన్ స్థానంలో దీనిని ఏర్పాటుచేశామని తెలిపింది. దీంతో ఇమ్రాన్‌కు ఇందులో సభ్యదేశాల సంఖ్యే తెలియదు కానీ, అవన్నీ తమకు మద్దతు తెలిపాయని ప్రకటించారంటే ఆయనకు ఎంత అవగాహన ఉందో అర్థంచేసుకోవచ్చని ఎద్దేవా చేస్తున్నారు. ఆయనకు జాగ్రఫీ, చరిత్రలేకాదు లెక్కలు కూడా నేర్పించాలని అంటున్నారు. గత నెలలో ఇరాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆతిథ్య దేశ అధ్యక్షుడు, పాక్ ప్రతినిధులు, మీడియా మిత్రులు తలలుపట్టుకున్నారు. భౌగోళిక సరిహద్దులపై ఆయనకున్న పరిజ్ఞానానికి విస్మయం చెందారు. ప్రాదేశిక పొరుగుదేశాలైన జపాన్, జర్మనీలు సరిహద్దులను పంచుకుంటూ ఆ ప్రాంతంలో సంయుక్తంగా పరిశ్రమలు స్థాపించాయని అనగానే అక్కడివారంతా అవాక్కయ్యారు. జపాన్ ఎప్పుడు జర్మనీవైపునకు వెళ్లిపోయిందని అట్లాస్‌లు తిరగేశారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం తూర్పు తీరంలోని ఆసియా దేశమైన జపాన్.. 6,800 దీవుల సమూహం.. యూరప్‌‌కు మరోవైపు జర్మనీ ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య దూరం దాదాపు 9 వేల కిలోమీటర్లు. దీంతో ఇమ్రాన్‌కు జాగ్రఫీ గురించి నేర్పించాల్సిన అవసరం ఉందని, చరిత్ర గురించి కూడా ఓ టీచర్‌ను కలిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో జోకులు పేలాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పొరుగు దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలు అర్థిక, సైనిక సహాకారంలో ఓ అవగాహనకు వచ్చి, అందులో భాగంగా సరిహద్దుల్లో పరిశ్రమలను ఏర్పాటుచేశాయి.


By September 14, 2019 at 02:04PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/unhrc-has-47-members-but-imran-claimed-pakistan-got-support-of-58-countries-viral-on-social-media/articleshow/71124205.cms

No comments