Breaking News

హాస్పిటల్లో చేరిన భార్య.. నేనే వస్తున్నా అరెస్ట్ చేసుకోండన్న చింతమనేని, బొత్సకు సవాల్!


మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌‌ను అరెస్టు చేసే విషయంలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. తాను ఎస్పీ ఆఫీసుకు వస్తున్నానని, అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకోవాలని చింతమనేని సూచించారు. పినకిడిమిలో అట్రాసిటీ కేసు నమోదు కావడంతో, గత కొద్ది రోజులగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. దళితుడిపై దాడి కేసులో చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం దుగ్గిరాలలోని ఆయన నివాసంలో పోలీసులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. తనపై కేసు పెట్టడంతో బెయిల్ కోసం కోర్టుకు వెళ్లానని చెప్పిన చింతమనేని.. టీడీపీ నేత సూచనతో ఆర్టీసీ డ్రైవర్ కు క్షమాపణలు చెప్పానన్నారు. గత వంద రోజుల్లో తానెప్పుడూ ఇంటి నుంచి బయటకు రాలేదన్నారు. ఎస్పీ ఆఫీసుకు తానే స్వయంగా వెళ్లి లొంగిపోతానని చెప్పారు. ఈ రోజు హైకోర్టు తన రిట్ పిటిషన్‌ను విచారిస్తోందనే విషయాన్ని గుర్తు చేశారు. తనపై కేసు నమోదైన పినకిడిమి గ్రామానికి వెళ్లి.. ఆ రోజు ఏం జరిగిందో గ్రామసభ పెట్టి విచారించుకోవచ్చని చింతమనేని సూచించారు. ‘‘నేను తప్పు చేసినట్టు రుజువైతే.. నా ఆస్తి మొత్తం రాసిస్తా. మరి బొత్స చేసిన వ్యాఖ్యలు తప్పని తేలితే, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని చింతమనేని ప్రశ్నించారు. చింతమనేని భార్య రాధ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసుల దౌర్జన్యాల కారణంగానే ఆమె అనారోగ్యానికి గురయ్యారని చింతమనేని అనుచరులు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి సహా పలు అరాచకాలకు చింతమనేని పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. చింతమనేని అరాచకాలకు బలైపోయిన బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ కోరారు. తమ భూములను చింతమనేని, ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారంటూ జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాలకు చెందిన పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


By September 11, 2019 at 10:29AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-ex-mla-chintamaneni-prabhakar-may-surrender-before-west-godavari-police-today/articleshow/71075308.cms

No comments