ఎక్కడో ఉన్న అమెజాన్ గురించి బాధపడ్డాం.. మనమేం చేస్తున్నాం: సాయి ధరమ్ తేజ్
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తుండటంతో రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందినవారు ఒక్కొక్కరిగా దీనిపై స్పందిస్తున్నారు. మన ప్రకృతిని కాపాడుకుందాం అంటూ నినదిస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, అనసూయ ఈ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చేరారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ అడవుల్లో కొద్ది రోజుల క్రితం కార్చిచ్చు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇది బ్రెజిల్‌లోని చాలా వరకు అడవిని దహించి వేసింది. వేలాదిగా వన్యప్రాణులను పొట్టన బెట్టుకుంది. భూ గ్రహంపై వెలువడే మొత్తం ఆక్సిజన్‌లో 20 శాతం ఈ అమెజాన్ అడవుల నుంచే ఉత్పత్తి అవుతుండటంతో ఇది అగ్నికి ఆహుతవుతుండంపై అంతా ఆందోళన వ్యక్తం చేశారు. మన సినిమా వాళ్లు వరసపెట్టి ట్వీట్లు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సూటిగా ప్రశ్నించారు. Also Read: ‘‘ఎక్కడో ఉన్న అమెజాన్ గురించి బాధపడ్డాం. మనం ఏం చేస్తున్నాం మరి. మన ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ నల్లమల’’ అని తేజూ ట్వీట్ చేశారు. నిజానికి సాయి ధరమ్ చెప్పింది కరెక్టే. అమెజాన్ నాశనం అవుతున్నప్పుడు ‘సేవ్ అమెజాన్’ అంటూ గొంతు చించుకున్న మన వాళ్లు ఇప్పుడు మన అటవీ సంపద, మన ప్రకృతిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు చూస్తుంటే ఎందుకు గొంతెత్తడం లేదు. ఒకరిద్దరు ట్వీట్లు చేసినంత మాత్రాన సరిపోదు కదా. ఒక ఉద్యమం రావాలి. దెబ్బకు ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలి. అలా కావాలి అంటే ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి బయటికొచ్చి ప్రభుత్వాలను నిలదీయాలి.
By September 13, 2019 at 11:15AM
No comments