మైగ్రేన్‌తో చాలా బాధపడ్డాను.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మహేశ్
సెలబ్రిటీలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవనుకుంటాం. వారికేంటండీ.. కావాల్సినంత డబ్బు, ఉండాలనికి ఇళ్లు, చేతినిండా సినిమాలు ఉంటాయి. ఇక వారికి అనారోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తాయి అనుకునేవారు లేకపోలేదు. కానీ వారూ మనుషులే. వారికీ అనారోగ్య సమస్యలు ఉంటాయి. తాజాగా సూపర్ స్టార్ తనకున్న అనారోగ్య సమస్య గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన ఒకప్పుడు విపరీతమైన మైగ్రేన్ సమస్యతో బాధపడ్డారట. దాని నుంచి సాంత్వన పొందడానికి ఎందరో వైద్యులను సంప్రదించారట. వారి వల్ల నయం కాని ఆ సమస్య.. చక్రసిద్ధ నాడి వైద్యంతో నయమైందని తెలిపారు. ‘ఈ మైగ్రేన్ సమస్య ఒక్కసారి వచ్చిందంటే విడిచిపెట్టదు. అసలు దీనికి నివారణే లేదు. ఎందరో వైద్యులకు చూపించుకున్నాను. కానీ సమస్య తీరలేదు. ఓ సారి నా భార్య నమ్రత తన స్నేహితురాలి ద్వారా ఓ డాక్టర్‌ను కలిశారు. నాకున్న మైగ్రేన్ సమస్య గురించి ఆమెకు వివరించారు. అప్పుడు ఆవిడ మైగ్రేన్‌ను నివారించగలను అని హామీ ఇచ్చారు. అలా నేను డాక్టర్ సత్య సింధూజను కలిశాను. ఆవిడకు చక్రసిద్ద నాడీ వైద్యం గురించి తెలుసు. ఆమె నాకు అందించిన చికిత్స ఏంటో తెలీదు కానీ నాలుగైదు సార్లు చికిత్స తీసుకున్న తర్వాత నాకున్న మైగ్రేన్ పూర్తిగా తగ్గపోయింది. ఇప్పుడున్న టాబ్లెట్లు కేవలం నొప్పిని తాత్కాలికంగా నివారిస్తాయి. అది సరైన పద్ధతి కాదు. నేను నొప్పి తట్టుకోలేక విపరీతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకునేవాడిని. నేను సత్య సింధూజ వద్ద చికిత్స తీసుకున్నాక అసలు మైగ్రేన్ వల్ల టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎలాంటి టాబ్లెట్లు తీసుకోకుండా ఇతర చికిత్సల ద్వారా అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చనేది నేను నమ్మే సిద్ధాంతం. నాలాగా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారికి ఎలా నివారించుకోవాలో తెలియాలనే నేను ఈ విషయాన్ని మీడియా ముందు మాట్లాడటానికి ఒప్పుకొన్నాను. నా కుటుంబీకులు, నా స్టాఫ్ మెంబర్స్‌కి మాత్రమే నాకు మైగ్రేన్ ఉందని తెలుసు. నేను నా వర్క్ ద్వారానే మెడిటేషన్ చేస్తుంటాను. నేను చేసే పనిలో అలసట ఉంటేనే అది నాకు కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఈ నాడీ వైద్యం గురించి ప్రచారం కల్పిస్తున్నానని అనుకోకపోతే ఎన్ని చికిత్సలు తీసుకున్నా మైగ్రేన్ వల్ల చాలా కాలంగా బాధపడుతున్నవారు ఒకసారి చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి తెలుసుకోండి. నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను కాబట్టి మీరూ కోలుకుంటారన్న నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు మహేశ్. ప్రస్తుతం మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. విజయశాంతి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By September 13, 2019 at 11:41AM
No comments