ABN, TV5 న్యూస్ ఛానెళ్లపై నిషేధం? జగన్ సర్కారు పనేనా? కారణాలేంటి..?
ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్, టీవీ5 కేబుల్ ఛానెళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఎంఎస్ఓలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏబీఎన్ ఛానెల్ ప్రసారాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆగిపోయాయని ‘ఆంధ్రజ్యోతి’ పత్రికే ప్రకటించుకుంది. మంత్రుల ఒత్తిడితోనే ఎంఎస్‌వోలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఏ కేబుల్‌లోనూ ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ కనిపించొద్దంటూ సీఎం జగన్ హుకుం జారీ చేయడంతోనే ఇలా జరిగిందని ఆరోపించింది. సీఎం జగన్ మాటగా చెబుతున్నాం.. ఏబీఎన్ కనిపించడానికి వీల్లేదని ఎంఎస్‌వోలను మంత్రులు బెదిరించారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఫ్రీ ఛానెల్ అయిన ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ని ట్రాయ్ రూల్స్ ప్రకారం ఎలా నిలిపేస్తారని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తోంది. కస్టమర్ కోరుకుంటే 72 గంటల్లోగా సర్వీస్ ప్రొవైడర్ ఆ ఛానెల్‌ను అందించాలని ఫ్రీ ఛానెల్‌ను ఏ కారణంగానూ నిరాకరించొద్దని చెబుతోంది. ఏబీఎన్ ప్రసారాలు కావాలంటే వీక్షకులు ఎంఎస్‌వోలకు ఫిర్యాదు చేయొచ్చని, వారు స్పందించకపోతే నేరుగా ట్రాయ్‌కు ఫిర్యాదు చేయొచ్చని ఆంధ్రజ్యోతి చెబుతోంది. కాగా వైఎస్ఆర్సీపీ వర్గాల వాదన మరోలా ఉంది. ప్రతి విషయాన్ని కావాలనే జగన్‌కు అంటగడుతున్నారని వైఎస్ఆర్సీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ‘‘సిటీ కేబుల్ వాళ్లకి.. కేబుల్ టీవీ ఎంఎస్ఓలు, డీటీహెచ్ కంపెనీలు, ఫ్రీ ఛానళ్లు.. క్యారియర్ ఛార్జీలు కట్టాలి. సిటీ కేబుల్‌కి గత ఐదేళ్లుగా ఏబీఎన్ క్యారియర్ ఛార్జీలు కట్టలేదు. ఛానల్స్ ప్రియారిటీ లిస్టులో 60వ స్థానంలో ఉంచారు. ఛార్జీలు కట్టకున్నా మిగతా ఛానళ్లతో సమానంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఈ ఛానెల్ 60 నుంచి 651కి మారిపోయింది. ఈ మూడు నెలల నుంచి కూడా కనీసం కొంత మొత్తమైనా సిటీ కేబుల్‌కు చెల్లించలేదు. వినియోగదారులను బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయమంటున్నారు. కానీ ఆపని ఛానెల్ యాజమాన్యం ఎందుకు ఫిర్యాదు చేయదు?’’ అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఏబీఎన్ ఛానెల్ ప్రసారాలు ఏపీలో ఆగిపోవడం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణలో ఏబీఎన్ ప్రసారాలు ఆగిపోయాయి. అప్పట్లో కేసీఆర్ సర్కారు రెండు ఛానెళ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో కాపుల పోరాటం నడిచినప్పుడు ‘సాక్షి’పై ఇలాగే అనధికారిక నిషేధం కొనసాగిన సంగతి తెలిసిందే.
By September 13, 2019 at 11:22AM
No comments