ఆస్తి భార్యకు రాసిచ్చాడని దూరం పెట్టిన ప్రియురాలు.. ఆక్రోశంతో నడిరోడ్డుపై దాడి
భర్త చనిపోయి పిల్లలతో బతుకీడుస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెపైనే పగబట్టాడు. ఆస్తినంతా భార్యా పిల్లలకే రాసేయడంతో ఆమె తన ప్రియుడిని ఇంటికి రానివ్వడం లేదు. దీంతో పగబట్టిన అతడు నడిరోడ్డుపై కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. విజయవాడలోని మొగల్రాజపురానికిచెందిన నాగేశ్వరరావు(50) అనే వ్యక్తి స్థానికంగా చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకొచ్చే సంపాదనతో భార్య బిడ్డలను పోషిస్తూనే కాస్త ఆస్తి సంపాదించాడు. ఈ క్రమంలోనే మొగల్రాజపురంలోని కొండపైన నివసించే మహిళ(45)తో అతడికి పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ మహిళ భర్త ఏడేళ్ల క్రితమే చనిపోగా ఇద్దరు కుమారులతో కలిసి ఉంటోంది. నాగేశ్వరరావు ఆమె కోసం స్థానికంగా ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నాడు. నాగేశ్వరరావు కారణంగా ఇటీవల కుటుంబంలో గొడవలు జరిగాయి. భార్య తన బంధువులకు ఈ విషయం చెప్పడంతో వారంతా అతడిని మందలించి ఆస్తిని భార్య పేరిటి రాయించారు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు నాగేశ్వరరావును దూరం పెట్టింది. నీ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రాసివ్వలేనప్పుడు నీతో సహజీవనం చేసే అవసరం నాకు లేదంటూ అతడిని దూరం పెట్టింది. తన ఇంటికి రావొద్దని, మాట్లాడేందుకు కూడా ప్రయత్నించొద్దని హెచ్చరించింది. దీంతో నాగేశ్వరరావు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనను దూరం పెడుతున్న ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం అమ్మ కల్యాణ మండపం జంక్షన్ నడుచుకుంటూ వెళ్తున్న తన ప్రియురాలిపై వెనుక నుంచి కత్తితో దాడిచేశాడు. మెడ భాగంలో కత్తి బలంగా దిగడంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు భారీ సంఖ్యలో గుమిగూడి ఆమెను 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
By September 06, 2019 at 10:11AM
No comments