Breaking News

అమెరికాలో మరోసారి పడగవిప్పిన గన్ కల్చర్.. ఐదుగురు మృతి


అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. టెక్సాస్‌లో నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని ఒడెస్సా ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 21మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులోల ముగ్గురు పోలీసులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని ఓ అనుమానితుడ్ని హతమార్చారు. ప్రస్తుతానికి ఘటనా స్థలిలో ముష్కరులు ఎవరూ లేరని తెలిపారు. టొయోటా వాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు తొలుత యూఎస్ పోస్టల్‌ సర్వీస్‌ వ్యాన్‌ని దొంగిలించారు. అనంతరం అదే వ్యాన్‌లో ఘటనా స్థలానికి చేరుకొని సామాన్య పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తొలుత దుండగులు ఓ పోలీస్‌పై కాల్పులు జరిపారు. మిండ్‌ల్యాండ్, ఒడెస్సా నగరాల మధ్య దుండగులు ప్రయాణిస్తోన్న కారును ఆపిన పోలీస్‌పై వారు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం రోడ్డుపై వెళ్తున్న పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీనిపై స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనన్న అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. శ్వేతజాతీయుడిగానే భావిస్తోన్న నిందితుడు వయసు 30 ఏళ్ల ఉంటుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు ఒడెస్సా మెడికల్ సెంటర్ హాస్పిటల్‌లో చికిత్స అందజేస్తున్నారు. వీరిలో రెండేళ్లలోపు వయసున్న ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలిపారు. గాయపడినవారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియజేశారు. కాల్పుల ఘటన స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు తనకు అందజేసినట్టు తెలిపారు. దీనిపై ఎఫ్‌బీఐతో పాటు ఇతర భద్రతాధికారులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబోట్‌ ఈ ఘాతుకాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. స్థానికంగా సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి అధికార యంత్రాంగం కృషిచేస్తోందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన... ఇలాంటి దుశ్చర్యలను టెక్సాస్‌ ప్రజలు ఐక్యంగా, సమర్థంగా ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు. కాగా, టెక్సాస్‌‌లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్‌ స్టోర్‌లోకి ఆగస్టు 4న ఆయుధాలతో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 21 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన మర్నాడే ఓహియోలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో తరుచూ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోటు చోటుచేసుకుంటునే ఉన్నాయి.


By September 01, 2019 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/random-gun-attacks-leave-five-dead-and-21-injured-near-odesse-city-in-texas/articleshow/70930859.cms

No comments