Breaking News

74 ఏళ్లకు మాతృత్వ మాధుర్యం.. పసికందులకు పాలిచ్చేందుకు అడ్డొస్తున్న వయసు, కానీ..!


తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 74 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చిన ఆమె.. సిజేరియన్ ద్వారా గురువారం ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లయిన 57 ఏళ్ల తర్వాత ఆమె పిల్లల్ని కనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఐవీఎఫ్ విధానాన్ని డాక్టర్లు 50 ఏళ్లలోపు మహిళలకే సూచిస్తారు. కానీ మంగాయమ్మకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేకపోవడం, అమ్మ కావాలని ఆమె బలంగా కోరుకుంటుండటంతో.. ఐవీఎఫ్ విధానాన్ని ఆశ్రయించారు. సంతానం కోసం గుంటూరులోని అహల్యా నర్సింగ్ హోం‌మ్‌లో చేరిన ఆమెకు డాక్టర్ ఉమాశంకర్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించింది. వేరే మహిళ అండాన్ని మంగాయమ్మ భర్త వీర్యంతో ఫలదీకరించారు. తొలి ప్రయత్నంలో ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ఆమె హాస్పిటల్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 57 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పిల్లలు పుట్టడంతో మంగాయమ్మ- రాజారాం దంపతులతోపాటు వారి బంధువుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఆమెకు పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమేమీ లేదన్న డాక్టర్ ఉమాశంకర్.. వయసు రీత్యా శిశువులకు ఆమె చనుబాలు ఇవ్వలేరని తెలిపారు. మిల్క్ బ్యాంక్ నుంచి తల్లి పాలను సేకరించి శిశువులకు అందిస్తామని డాక్టర్ తెలిపారు. దీని వల్ల చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు.


By September 06, 2019 at 10:51AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/mangayamma-will-not-be-able-to-breastfeed-her-babies-says-dr-umasankar/articleshow/71004187.cms

No comments