నడిరోడ్డుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే వేడుకలు.. స్తంభించిన ట్రాఫిక్, 2 గంటలు నరకయాతన
‘ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. వారికి ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించాలి. ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడొద్దు..’ ఏపీ సీఎం వైఎస్ జగన్ చెబుతున్న మాట ఇది. కానీ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు. నడిరోడ్డు మీద, అందులోనూ నాలుగు రోడ్ల జంక్షన్‌లో పుట్టిన రోజు వేడుకలు చేసుకొని.. రెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు తనయుడు వికాస్ పుట్టిన రోజు వేడుకలను అంబాజీపేటలోని ఓ జంక్షన్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యేగారి అబ్బాయి అంటే.. కాబోయే ఎమ్మెల్యే కదా.. అనుచరులంతా ఆయన పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బర్త్ డే వేడుకలు నిర్వహించడంతో.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన వారు, స్కూల్ పిల్లలు.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎమ్మెల్యే గారబ్బాయి పుట్టిన రోజు వేడుకల పట్ల పోలీసులు సైతం సైలెంట్‌గా ఉండిపోయారు. ఎమ్మెల్యే కొడుకు పుట్టిన రోజైతే.. ఇంట్లో గ్రాండ్‌గా సెల్రబేట్ చేసుకోవచ్చు కదా.. ఇలా రోడ్డు మీద సంబరాలు చేసుకుంటూ జనాలను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాసేవ చేయకపోతే చేయకపోయారు.. ఇలా జనాలను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By September 19, 2019 at 12:06PM
No comments