Breaking News

‘తేజస్’లో ప్రయాణించి చరిత్ర సృష్టించిన రాజ్‌నాథ్!


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ గురువారం ప్రయాణించారు. జీ-సూట్‌, హెల్మెట్‌, ఆక్సిజన్‌ మాస్క్‌ ధరించి తేజస్‌ యుద్ధ విమానంలో పైలట్‌ వెనుక కూర్చున్న రాజ్‌నాథ్.. బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ () ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించి ఇందులో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా రికార్డు సృష్టించారు. రాజ్‌నాథ్‌ వెంట ఎయిర్ వైస్ మార్షల్, నేషనల్ ఫ్లయిట్ టెస్ట్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ తివారీ కూడా ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం బెంగళూరుకు చేరుకున్న రక్షణ మంత్రి.. డీఆర్‌డీవో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనకు హాజరుకానున్నారు. భారత వైమానిక దళం అమ్ములపొదిలో తేజస్‌ యుద్ధ విమానాలను చేర్చిన విషయం తెలిసిందే. ఈ విమానానికి సంబంధించిన నేవీ వెర్షన్ గతవారం కీలక పరీక్ష పూర్తిచేసుకుంది. ‘అరెస్టెడ్‌ ల్యాండింగ్‌’ అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా విమానవాహక నౌకపై క్షేమంగా దిగే సామర్థ్యాన్ని అది ప్రదర్శించింది. దీంతో ఇలాంటి యుద్ధవిమానాన్ని రూపొందించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. తొలుత 40 యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్‌కు రక్షణ శాఖ ఆర్డర్ ఇవ్వగా.. మరో 83 విమానాల కోసం 2018లో అనుమతిచ్చారు. వీటి విలువ రూ.50వేల కోట్లు ఉంటుంది. 2019 ఫిబ్రవరిలో తేజస్ విమానం వాయుసేనలో చేరింది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత యుధ్ధ విమానానికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదివరకే స్టార్ షట్లర్ పీవీ సింధు తేజస్‌లో విహరించారు. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడంతో పాటు పలు ప్రత్యేకతలు తేజస్ సొంతం. ఈ యుద్ధ విమానానికి మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి తేజస్ అని నామకరణం చేశారు. తేజస్ అంటే సంస్కృత భాషలో తేజస్సు, వెలుగు అని అర్థం.


By September 19, 2019 at 12:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajnath-flies-in-tejas-becomes-first-defence-minister-to-fly-in-light-combat-aircraft/articleshow/71197332.cms

No comments