Breaking News

నాకు యాక్సిడెంట్ కాలేదు.. అది నా కారు కాదు: హీరో తరుణ్


ఒకప్పటి లవర్ బోయ్, ప్రముఖ నటుడు కారు ప్రమాదానికి గురయ్యారని, ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని మంగళవారం ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబరుతో ఉన్న వోల్వో లగ్జరీ కారు రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొట్టి అదుపు తప్పింది. ఈ కారులో హీరో తరుణ్ ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారని, కారును ప్రమాద స్థలంలో ఆయన వదిలిపెట్టి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, ఆ కారు అసలు తరుణ్‌ది కాదని తేలింది. ఈ కారు ప్రమాదంపై నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గరైన కారు లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందని చెప్పారు. కారులో హీరో తరుణ్ లేరని స్పష్టం చేశారు. ఆ కారు తరుణ్‌ది కాదని ఆయన తల్లి రోజా రమణి కూడా వెల్లడించారని తెలిపారు. అయితే, యాక్సిడెంట్ సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కారు యజమాని ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రమాదానికి గురైన కారు తనది కాదని హీరో తరుణ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం టీవీ9 న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఆ కారు తనది కాదని చెప్పారు. తాను ఇంట్లోనే ఉన్నానని, ఉదయం నుంచి తనకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు. తాను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి స్నేహితులు, యూఎస్‌లో ఉన్న ఆప్తమిత్రులు తనకు ఫోన్లు చేస్తున్నారని, అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని తరుణ్ చెప్పారు. టీవీలో ఈ న్యూస్ చూసి తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. అసలు తనకు వోల్వో కారు లేదని.. తాను జాగ్వార్, స్కోడా కార్లు వాడుతున్నానని స్పష్టం చేశారు. మీడియా నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుందని, ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రసారం చేయొద్దంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు.


By August 20, 2019 at 09:51AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-tarun-kumar-met-with-an-accident-its-a-fake-news/articleshow/70748259.cms

No comments