‘సాహో’ ఫస్ట్ రివ్యూ: పాత రికార్డులన్నీ పగిలిపోయినట్టే..!
‘బాహుబలి’ సిరీస్ తరవాత రెబల్ స్టార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీస్థాయిలో విడుదలవుతోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘సాహో’ యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ‘సాహో’ రన్ టైమ్ 2 గంటల 51 నిమిషాలు కావడంతో ప్రభాస్ అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే, అసలు ప్రభాస్ అభిమానులు కంగారుపడాల్సిన అవసరమే లేదని యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకుంటోన్న ఉమైర్ సంధు అంటున్నారు. భారీ చిత్రాల విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఉమైర్ సంధు.. ఎప్పటిలానే ‘సాహో’కు సూపర్ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. యూఏఈలో ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుందని, అద్భుతంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘సాహో’ ఫస్ట్ హాఫ్ చూసిన తరవాత ప్రేక్షకుల సంబ్రమాశ్చర్యానికి గురికావడం ఖాయమని ఉమైర్ సంధు పేర్కొన్నారు. ప్రభాస్ ఎంట్రీ జస్ట్ పైసా వసూల్ అని అభివర్ణించారు. యాక్షన్ స్టంట్స్, ఛేజ్‌లు మతిపోగొడతాయని చెప్పారు. ప్రభాస్ అద్భుతంగా చేశారని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రభాస్ ఈ సినిమాలో యాంటగానిస్ట్‌గా నటించారని, ఇలాంటి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఆకాశానికి ఎత్తేశారు. మొత్తంగా చూసుకుంటే, ‘సాహో’ సాలిడ్ ఎంటర్‌టైనర్ అని ఉమైర్ సంధు వెల్లడించారు. యాటిట్యూడ్, స్టార్ పవర్ కలిపి అభిమానులకు కావాల్సినదానికన్నా ఎక్కువ వినోదాన్నే పంచారని పేర్కొన్నారు. ప్రభాస్ మరోసారి అద్భుతం చేశారని చెప్పారు. ఈ సినిమా గత రికార్డులను తుడిచిపెట్టేస్తుందని, కొత్త రికార్డులను నెలకొల్పుతుందని అన్నారు. ‘‘ష్యూర్-షాట్ బ్లాక్‌బస్టర్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఉమైర్ సంధు తాను రివ్యూ ఇచ్చిన సినిమాను పొగడ్తలతో ముంచెత్తడం కొత్తేమీకాదు. ఆయన ప్రతి సినిమాకు ఇలా పాజిటివ్ రివ్యూలే ఇస్తారు. ఉమైర్ సంధు నాలుగు స్టార్లు ఇచ్చిన చాలా తెలుగు సినిమాలు డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. ఇలాంటి వాటిలో మహేష్‌బాబు ‘స్పైడర్’ ఒకటి. కాబట్టి, మనం పూర్తిగా ఉమైర్ సంధు రివ్యూపై ఆధారపడిపోలేం. సినిమా ఎలా ఉందో పక్కాగా తెలియాలంటే ఆగస్టు 30 వరకు ఆగాల్సిందే..!
By August 25, 2019 at 04:29PM
No comments