ఏపీలో ఇసుక రాజకీయం రచ్చ.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
ప్రభుత్వ వైఖరి కారణంగానే ఏపీలో తలెత్తిందని ఆరోపిస్తున్న టీడీపీ.. జగన్ సర్కారు వైఖరికి నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతోంది. తెలుగు దేశం కార్యకర్తల్లారా కదలిరండి.. ఇసుక అక్రమాలపై నినదిద్దాం... నిలదిద్దాం.. నిరసిద్దాం.. అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా ఏపీ ప్రభుత్వం టీడీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేసింది. చింతమనేని ప్రభాకర్, దేనినేని ఉమా లాంటి నేతలను గృహ నిర్భందంలో ఉంచింది. ఏలూరులో పోలీసులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గృహ నిర్భందం చేశారు. ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ముందస్తు అరెస్టుల్లో భాగంగా.. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లో ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు గొల్లపూడిలో హౌస్ అరెస్ట్ చేశారని ఆయన ఫేస్‌బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. గొల్లపూడిలో ఇసుక కొరతపై రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేవినేని ఉమా బయల్దేరుతుండగా అప్పటికే పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న పోలీసులు దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్యగా ఉమా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి పేదలకు ఉపాధి లేకుండా వారి జీవనభృతికి ఇబ్బందులు కలిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను, ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం తాము చేస్తున్న నిరసన కార్యక్రమాలను నిరంకుశ విధానాలతో పోలీసులను పంపించి ప్రభుత్వం అడ్డుకుంటుందని ఇలాంటి విధానాలతో తమను అడ్డుకోలేరని ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని దేవినేని ఉమా హెచ్చరించారు.
By August 30, 2019 at 11:49AM
No comments