Breaking News

కశ్మీర్ మా అంతర్గత వ్యవహారం.. జోక్యం చేసుకుంటే.. : పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!


కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 370ను కేంద్రం రద్దుచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న దాయాది పాక్.. దీన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని ప్రయత్నించి బొక్క బోర్లాపడింది. పెద్దన్న అమెరికా సైతం భారత్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించగా, చైనా నోరు విప్పడం లేదు. ఇస్లామిక్ దేశాల నుంచి మోదీ తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి వ్యతిరేకత రాకపోవడంతో పాక్ ఒంటరిగా మారింది. దీంతో భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ దాయాది కయ్యానికి కాలుదువ్వుతోంది. పాక్ ప్రధాని సహా ఆ దేశ అగ్రనేతలు అసందర్భ ప్రేలాపనలు, దూషణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు భారత్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేసింది. కశ్మీర్ అంశంపై పాక్ నేతల ప్రకటనలకు ఘాటుగా బదులిచ్చింది. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని, దీనిలో జోక్యం చేసుకుంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. అంతేకాదు, ఉగ్రవాదాన్ని తన విధానంగా చేసుకున్న పాక్ దాన్ని వదలిపెట్టాలని సూచించింది. కశ్మీర్ అంశంపై పాక్ ప్రకటనలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందిస్తూ.. భారత్ అంతర్గ అంశంపై నేతలు చేస్తున్న బాధ్యతారాహిత్య ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పాక్ నేతల ప్రకటనల వెనుక దేశంలో హింసను ప్రేరేపించడమనే దురుద్దేశం స్పష్టంగా కనబడుతోందని ఆయన దుయ్యబట్టారు. అబద్ధాలు, మోసాలతో రెచ్చగొట్టే పాక్ వైఖరిని ప్రపంచం మొత్తం చూస్తున్న విషయాన్ని వారు అర్ధంచేసుకోవాలని చురకలంటించారు. పొరుగు దేశాల్లోకి ఉగ్రవాదులను తరలించడం మానుకోవాలని, పాక్ ప్రవర్తన ఓ సాధారణ దేశం మాదిరిగా ఉండాలని రవీశ్ కుమార్ సూచించారు. అంతేకాదు, భారత్, జమ్మూ కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితికి పాక్ మంత్రి షీరీన్ మజారీ రాసిన లేఖను ఆయన కొట్టిపారేశారు. ప్రకటనలు గుప్పించే ముందు అక్కడ ఏం జరగుతుందో ప్రతి ఒక్కళ్లూ తెలుసుకోవాలని రవీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో తీవ్రవాద చొరబాట్లకు సహకరిస్తోన్న పాకిస్థాన్ ప్రభుత్వ విధానం గురించి అందరికీ తెలుసని, దీనిపై తాము నిరంతరం వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకోవాలని రవీశ్ కుమార్ డిమాండ్. దేశంలోని పాక్ ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా చొరబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాలు సమాచారాన్ని రవీశ్ కుమార్ ధ్రువీకరించారు. ఐబీ సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని అన్నారు.


By August 30, 2019 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-warns-to-pakistan-due-to-pm-imran-and-other-top-leaders-statements-on-the-kashmir-issue/articleshow/70905136.cms

No comments