కీచక టీచర్.. గురుకుల విద్యార్థినులపై లైంగి వేధింపులు
కుటుంబానికి దూరంగా ఉంటూ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో ప్రబుద్ధుడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే తమపై కీచక పర్వానికి పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియని నిస్సహాయ స్థితి వారిది. దీంతో ఆ బాధను పంటి బిగువున భరిస్తూ నెట్టుకొస్తున్నారు. మంగళవారం విద్యార్థినుల బాగోగులు విచారించేందుకు అధికారిణి ఎదుట వారంతా తమగోడు వెళ్లగక్కుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో బాలికల గురుకుల పాఠశాల ఉంది. దీనికి ప్రిన్సిపల్‌గా వి.వి. ప్రశాంతికుమారి, వైఎస్ ప్రిన్సిపల్‌గా కృపారావు వ్యవహరిస్తున్నారు. సాధారణ తనిఖీలో భాగంగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త టి.రాధా సుధారాణి మంగళవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. ముందుగా ప్రిన్సిపల్, స్టాఫ్‌ను విచారించిన ఆమె తర్వాత స్టూడెంట్స్‌ను విచారించారు. ఈ సందర్భంగా వైఎస్ ప్రిన్సిపల్ కృపారావు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి బోరుమన్నారు. దీంతో ఆమె కృపారావుపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. నాపై కుట్ర: కృపారావు విద్యార్థినులు తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కుట్రలో భాగమేనని కృపారావు అంటున్నారు. స్కూల్‌లోని కొందరు లేడీ టీచర్లే తనపై కుట్రపన్ని బాలికలతో అలా చెప్పించారని ఆరోపించారు. కృపారావు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు బాలికలెవరూ గతంలో తనకు ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపల్ ప్రశాంతికుమారి చెబుతున్నారు.
By August 28, 2019 at 07:57AM
No comments