6నెలల్లో 15 చోరీలు.. ఓయూ నిందితుల నేరాల చిట్టా
జైలుకెళ్లి వచ్చినా ఆ ఇద్దరి బుద్ధి మారలేదు. ఆరు నెలల్లోనే ఏకంగా 15చోరీలు చేసి తన చేతివాటం చూపించారు. గతంలో మాదిరిగానే మళ్లీ పోలీసులకు చిక్కారు. వీరిద్దరు ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక చోట చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓయూ లేడీస్ హాస్టల్‌లోకి చొరబడి యువతిని కత్తితో బెదిరించి అత్యాచారాయత్నానికి పాల్పడిన నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. మహబూబ్‌నగర్ జిల్లా చెదుర్‌వెల్లికి చెందిన పోటేల్ రమేష్ అలియాస్ పటేల్ రమేష్(32) కూలీ పని చేసుకుంటూ ప్రస్తుతం నగర శివారు బోడుప్పల్‌లో ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ అయిన అతడి మిత్రుడు గుండూరి కిరణ్(32)తో కలిసి చోరీలకు అలవాటు పడ్డాడు. 2013లో వీరు చోరీల ప్రస్థానం ప్రారంభించగా మరుసటి ఏడాదిలోనే పోలీసులకు చిక్కారు. 2016, 2017 సంవత్సరాల్లోనూ వీరిద్దరు జైలుకెళ్లడం, తిరిగొచ్చి చోరీలు చేయడం సర్వసాధారణమై పోయింది. కిరణ్ వ్యవహార శైలి నచ్చక అతడి భార్య సైతం వదిలేసింది. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న కిరణ్‌తో కలిసి రమేష్ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకునేవారు. క్యాబ్ ఎక్కే ప్రయాణికులు తమ ఇంటికి తాళం దూర ప్రాంతాలకు వెళ్లడం గమనించి ఆ ఇళ్లను దోచుకునేవారు. రమేష్ ఆగస్టు 15న ఉస్మానియా యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్‌లో దొంగతనానికి వచ్చి యువతిని కత్తితో బెదిరించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.15.37లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
By August 28, 2019 at 08:29AM
No comments