వారంలో ఎస్ఐగా ప్రమోషన్ .. రోడ్డుప్రమాదంలో ఏఎస్ఐ మృతి
జిల్లాలో ముంబయి రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఏఎస్ఐ వెంకటరాజు(56) మృతి చెందారు. గురువారం రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహించిన వెంకటరాజు శుక్రవారం ఉదయం డ్యూటీ దిగారు. నెల్లూరు వెళ్లేందుకు ఆత్మకూరులోని నెల్లూరుపాళెం వద్ద ఓ కారు ఎక్కారు. వీరి కారు వాసిలి సమీపానికి చేరుకోగానే రోడ్డుపై హఠాత్తుగా పంది అడ్డం వచ్చింది. దీంతో డ్రైవర్ మోహన్‌రెడ్డి స్టీరింగ్ పక్కకు తిప్పగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. తలకు తీవ్రగాయాలు కావడంతో వెంకటరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, డ్రైవర్ మోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలియగానే ఆత్మకూరు ఎస్ సంతోష్‌కుమార్ రెడ్డి, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన వెంకటరాజు, మోహన్‌రెడ్డిలను వెలికి తీశారు. వెంకటరాజు గురువారం రాత్రి ఆత్మకూరులో పెట్రోలింగ్ విధులు నిర్వహించారు. కాసేపటికే ప్రమాదంలో ఆయన చనిపోవడంతో పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు రూరల్ పీఎస్ నుంచి ఏడాది క్రితం ఆయన ఆత్మకూరుకు బదిలీపై వచ్చారని, ఇటీవలే ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మరో వారంలోగా ఎస్ఐగా ప్రమోషన్ వచ్చే అవకాశమున్న సందర్భంలో ఆయన మృతిచెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరాజుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలిద్దరికీ వివాహమైంది. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన రెడిచర్లకు తరలించారు.
By August 31, 2019 at 08:26AM
No comments