70ఏళ్ల వృద్ధురాలి సాహసం.. గొలుసు దొంగను పట్టుకుని చితకబాదింది
ఇటీవల తమిళనాడులో వృద్ధ దంపతులు దొంగలను తరిమికొట్టిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దేశమంగా వారి ధైర్య సాహసాలను కొనియాడింది. ఇలాంటి ఘటనే తాజాగా జిల్లాలో చోటుచేసుకుంది. బైక్‌పై తన మెడలోని గొలుసు తెంచుకుని పారిపోతున్న దొంగను 70ఏళ్ల వృద్ధురాలు చాకచక్యంగా పట్టుకుని చితకబాదింది. కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ఆళ్ల నాగేశ్వరమ్మ (70) అనే వృద్ధురాలు శుక్రవారం మధ్యాహ్నం సరుకులు తెచ్చుకునేందుకు కిరాణా దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తోంది. ఇంతలో వెనుక నుంచి బైక్ వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన నాగేశ్వరమ్మ సరుకులు అక్కడే వదిలేసి దొంగ చొక్కా కాలర్ పట్టుకుంది. దీంతో అతడు బైక్ పైనుంచి కింద పడిపోయాడు. వెంటనే ఆమె తన గొలుసును లాక్కుని అతడి మొహంపై రెండు పిడిగుద్దులు కురిపించింది. ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. 70ఏళ్ల వయస్సులోనే నాగేశ్వరమ్మ చూపిన తెగువను స్థానికులు కొనియాడారు. కాసేపటికే పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను తమతో తీసుకెళ్లారు.
By August 24, 2019 at 10:47AM
No comments