జాబిల్లి చెంతకు చంద్రయాన్-2.. విజయవంతంగా కక్ష్యలోకి
ఎన్నో అంచనాలతో ప్రయోగించిన ప్రాజెక్టులో ఇస్రో మరో ఘనత సాధించింది. కీలక ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించి ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. మంగళవారం ఉదయం 9.02 గంటలకు ద్రవపు ఇంజిన్‌ను మండించడం ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహం జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. జులై 22న జీఎస్‌ఎల్‌వీ-మార్క్3ఎం1 ద్వారా రోదసిలోకి వెళ్లిన చంద్రయాన్-2 ఉపగ్రహం 29రోజుల తర్వాత కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కీలక ఘట్టం ద్వారా చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యకు 150 కిలోమీటర్ల దూరానికి చేరింది. ఇప్పటి నుంచి ఉపగ్రహం వేగం తగ్గించుకుని దశ, దిశ మార్చుకుని విజయవంతంగా జాబిల్లి ఉపరితలం మీదకు చేరుకోనుంది. సెప్టెంబర్ 2వ తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టడం ద్వారా ల్యాండింగ్ సాఫీగా జరిగేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగం చేయనున్నారు. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 1.30-2.30 గంటల మధ్యలో ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రుడిపై దిగిన నాలుగు గంటల తర్వాత ఆరు చక్రాలు కలిగిన రోవర్ బయటకు వస్తుంది. సెకనుకు సెంటీమీటర్ వేగంతో పనిచేసే ఈ రోవర్ చంద్రుడిపై 14రోజుల్లో 500 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ తీసే ప్రతి విజువల్‌ని 15 నిమిషాల వ్యవధిలో భూమికి చేరవేస్తుంది. కీలక ఘట్టం ముగిసి చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడంతో యావత్ భారతావని సెప్టెంబర్ 7వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
By August 20, 2019 at 10:30AM
No comments