జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-2.. సెప్టెంబరు 3న కీలక దశ!
చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 జాబిలికి మరింత చేరువవుతోంది. చంద్రుడి కక్ష్యను తగ్గించుకునే దిశగా మూడు కీలక ప్రక్రియలను విజయవంతంగా దాటిన చంద్రయాన్-2 శుక్రవారం నాలుగో దశను ముగించింది. సాయంత్రం 6.18 గంటల సమయంలో కక్ష్య తగ్గింపు ప్రక్రియను ప్రారంభించిన ప్రొపల్షన్ సిస్టమ్.. చంద్రుడి ఉపరితలం నుంచి కక్ష్య పరిధిని 124కి.మీల నుంచి 164కిలోమీటర్లకు చేర్చింది. నాలుగో దశ కక్ష్య తగ్గింపు ప్రక్రియ 1,155 సెకన్లపాటు (19.25 నిమిషాలు) కొనసాగినట్లు బెంగళూరులోని ఇస్రో మిషన్ ఆపరేటర్ కంట్రోల్ కేంద్రం ప్రకటించింది. ఈ దశలోనూ చంద్రయాన్-2 వ్యవస్థలన్నీ సాధారణంగానే పనిచేశాయని తెలిపింది. కక్ష్య తగ్గింపు ప్రక్రియలోని చివరి దశను సెప్టెంబరు 1న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో పూర్తి చేసుకోనుందని ప్రకటించింది. ఈ దశలో చంద్రుడి కక్ష్యను 100 కిలోమీటర్లకు కుదిస్తారు. అలాగే, చంద్రయాన్-2లో అత్యంత కీలకమైన ల్యాండర్ విడిపోయే ప్రక్రియను సోమవారం (సెప్టెంబరు 2) చేపట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. ల్యాండర్ విడిపోయిన తర్వాత సెప్టెంబరు 3న పనితీరును పరిశీలించనున్నారు. సెప్టెంబరు 4న విక్రమ్‌ను చంద్రుడి ఉపరితలంపై 6.5 సెకెన్లపాటు దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబరు 7 తెల్లవారుజామున 1.40 గంటలకు ల్యాండర్ 35 కిలోమీటర్ల x 97 కిలోమీటర్ల మధ్య కక్ష్యలో ఉన్నప్పుడు దాని పరిమితిని పరిశీలించి, 1.55 గంటలకు ఉపరితలంపై దింపనున్నట్టు ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన నాలుగు గంటల తర్వాత రోవర్ బయటకు రానుంది. కాగా, జులై 22న జీఎస్‌ఎల్వీ-మార్క్3ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 కంపోజిట్ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ రాకెట్ 16.33 నిమిషాలలో నిర్ణీత కక్ష్యలోకి చంద్రయాన్-2 మాడ్యూల్‌ను చేరవేసి తన విశ్వసనీయతను నిరూపించుకుంది.
By August 31, 2019 at 10:07AM
No comments