Breaking News

Rajasthan: మరిదిని లాకప్‌డెత్ చేసి వదినపై గ్యాంగ్ రేప్


దొంగతనం చేశాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని తీసుకెళ్లిన పోలీసులు అతడికి నరకం చూపారు. ఈ తర్వాత అతడి వదినను కూడా పోలీస్‌స్టేషన్‌కు రప్పించి చిత్రహింసలు పెట్టారు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెపై స్టేషన్‌లోనే ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు శాఖకే మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో నేమిచంద్(22) అనే యువకుడిని దొంగతనం ఆరోపణలతో జూన్ 30న పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని చిత్రహింసలు పెట్టినా అతడు అంగీకరించలేదు. దీంతో ఆరో తేదీన అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు నేమిచంద్ వదినను తమతో తీసుకెళ్లారు. ఆమె ఎదుటే తీవ్రంగా కొట్టడంతో నేమిచంద్ స్టేషన్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందన్న కోపంతో మృతుడి వదినను తీవ్రంగా హింసించారు. ఆమె గోళ్లు పీకేసి, కళ్లు కమిలిపోయే పిడిగుద్దులు కురిపించారు. వారి దెబ్బలు తాళలేక నిస్సహాయురాలిగా పడివున్న ఆమెపై ఆరుగురు పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితులపైనా రేప్ కేసు నమోదు చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది.


By July 15, 2019 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajasthan-dalit-women-gang-raped-by-cops-after-brother-in-law-died-in-custody/articleshow/70223401.cms

No comments