Breaking News

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడి కుటుంబానికి గ్రామ బహిష్కరణ


తెలుగు రాష్ట్రాల్లో వరుస అత్యాచార ఘటనలతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. అత్యాచారాల వల్ల బాధితులే కాదు.. నిందితుల కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. నెల రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి భార్య, బిడ్డలను గ్రామం నుంచి వెలి వేసిన సంఘటన జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి గత నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యా, పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ కామాంధుడు తమ ఇంటికి ఎదురుగా ఉండే చిన్నారిపై కన్నేసి ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితుడి చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో స్థానికులు తమపై దాడి చేసే అవకాశముందని ఆందోళన పడిన నిందితుడి కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం నిందితుడి భార్య, పిల్లలతో కలిసి తిరిగి గ్రామానికి వచ్చి జీవిస్తోంది. ఎదురెదురు ఇళ్లు కావడంతో బాధిత చిన్నారి నిందితుడి కుటుంబాన్ని చూసి భయపడుతోంది. దీంతో బాలిక తల్లి ఈ విషయాన్ని గ్రామ పెద్దల వద్దకు తీసుకెళ్లింది. దీనిపై మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమావేశమై బాధితురాలి మానసిక పరిస్థితి దృష్ట్యా నిందితుడి కుటుంబాన్ని గ్రామం నుంచి పంపించేయాలని నిర్ణయించారు. ఈ విషయం చెప్పేందుకు నిందితుడి ఇంటికి అందరూ ర్యాలీగా వెళ్లగా అప్పటికే ఆ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. నిందితుడి కుటుంబాన్ని మళ్లీ గ్రామంలోకి అనుమతించొద్దని, వారితో గ్రామస్థులు ఎవరూ మాట్లాడకూడదని పెద్దలు తీర్మానం చేశారు.


By June 24, 2019 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/6year-old-girl-raped-accused-family-exclusion-from-the-village/articleshow/69922790.cms

No comments