Breaking News

నేటి నుంచి ఏపీలో కలెక్టర్ల సదస్సు.. చివరి నిమిషంలో షెడ్యూల్‌ మార్పు


ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, నవరత్నాల అమలు, ఇతర కీలక అంశాలపై జిల్లా కలెక్టర్లకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. తొలి రోజు సోమవారం వివిధ ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రాధామ్యాలపైన, రెండో రోజు మంగళవారం శాంతి భద్రతలపై సీఎం సమీక్షించనున్నారు. కలెక్టర్ల సదస్సును తొలుత ఒక్క రోజే నిర్వహించాలని నిర్ణయించారు. దీనిని సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే షెడ్యూలులో మార్పులు చేశారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం తాజా షెడ్యూల్ ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తొలి రోజు సదస్సు ముగించి, మళ్లీ మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం జగన్‌ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రజావేదికలో జరిగే సమావేశంలో నవరత్నాల అమలుపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సదస్సులో ముందుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సదస్సు ఉద్దేశాల్ని తెలియజేస్తారు. తర్వాత డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించి చర్చ మొదలవుతుంది. రెవెన్యూ శాఖలో కొత్త జిల్లాల ఏర్పాటు, భూముల రీసర్వే, ఇళ్ల స్థలాలకు భూసేకరణ, ఆరోగ్యశ్రీ సేవలు మరింత చేరువ, దీని పరిధిలోకి మరిన్ని వ్యాధులను చేర్చడం, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, అమ్మఒడి లాంటి పథకాలు అమలు, గ్రామ సచివాలయాల ఏర్పాటుపైనా కలెక్టర్లకు సీఎం జగన్ మార్గదర్శనం చేయనున్నారు. సోమవారం ఉదయం 11.15 నుంచి 11.45 వరకు పాలనలో పారదర్శకత, గ్రామ సచివాలయం, గ్రామ వలంటీర్ల విధానం, 11.45 నుంచి 12.15 వరకు ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, ఇతర అంశాలు, మధ్యాహ్నం 12.15 నుంచి 12.45 గంటల వరకు పౌరసరఫరాలు, నిత్యావసరాల సేకరణ, ఇంటింటికీ సరఫరా, 12.45 నుంచి 1.15 గంటల వరకు పాఠశాలలో విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ, 1.15 నుంచి 1.45 గంటల వరకు వ్యవసాయ రంగ స్థితిగతులు, పశుగ్రాసం, తాగునీరు, విద్యుత్తు సరఫరా, కౌలుదారులకు రుణ అర్హత కార్డులు, 2.30 నుంచి 3.00 గంటల వరకు సామాజిక భద్రత పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణంపై చర్చిస్తారు. ఒక్కో అంశానికి అరగంట చొప్పున కేటాయించారు. రెండో రోజు మాత్రం శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10.00 నుంచి 11.30 గంటల వరకు శాంతిభద్రతలు, 11.30 నుంచి 1.30 వరకు ఎస్పీలతో పోలీసు సమీక్ష ఉంటుంది. ఈ సమీక్షకు మాత్రం కలెక్టర్లు, కార్యదర్శులకు అనుమతి లేదు.


By June 24, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/today-will-starts-two-days-collectors-conference-at-praja-vedika-in-amravati/articleshow/69921188.cms

No comments