Breaking News

‘దర్బార్‌’లో డబుల్ అంట!


మన దర్శకనిర్మాతలు, హీరోలు ఇంకా భావదారిద్య్రంలోనే ఉన్నారు. ఒకప్పుడు మనవారు పాత హాలీవుడ్‌, కొరియన్‌ భాషా చిత్రాల నుంచి మెయిన్‌ పాయింట్‌ని కాపీ చేసి దానిని మనకు తగ్గ విధంగా మార్పులు చేర్పులు చేసేవారు. కానీ నాడు వేరు. నేడు సోషల్‌మీడియా బాగా విస్తరించింది. ఇలాంటి విషయాలు క్షణాలలో వైరల్‌ అయిపోతున్నాయి. ఇక హాలీవుడ్‌తో పాటు ఇతర పరభాషా చిత్రాల నుంచి మెయిన్‌ పాయింట్‌ని తీసుకోవడం తర్వాత... ఏకంగా పోస్టర్స్‌ని కూడా మన వారు యాజిటీజ్‌గా కాపీ కొట్టడం చూస్తే ఔరా అనిపించకమానదు. ఏదైనా క్రేజీ కాంబినేషన్‌ అనౌన్స్‌ అయిన వెంటనే మన నెటిజన్లే తమకున్న క్రియేటివిటీతో అద్భుతమైన పోస్టర్స్‌ని డిజైన్‌ చేస్తున్నారు. కానీ ఆ పాటి ఇంగితం కూడా మన సినీ మేకర్స్‌కి ఉండటం లేదు. 

ఇటీవల త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-పవన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ స్టోరీ కాపీ వివాదం తీవ్ర విమర్శలకు గురై చివరకు త్రివిక్రమ్‌ గుడ్‌విల్‌నే దెబ్బతీసింది. ఇదంతా చూస్తుంటే మన మేకర్స్‌ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవ్వరూ గమనించడం లేదని భావించే చందంగా ఉందనే చెప్పాలి. 

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, మురుగదాస్‌ల తొలి కాంబినేషన్‌లో ‘దర్బార్‌’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రూపంలో టైటిల్‌ని కూడా డిజైన్‌ చేసి సినీ మేకర్స్‌ ఓ స్టిల్‌ని వదిలారు. అది అచ్చం అప్పుడెప్పుడో వచ్చిన కిల్లింగ్‌ గంతర్‌ అనే హాలీవుడ్‌ మూవీ పోస్టర్‌ని యాజిటీజ్‌గా కాపీ కొట్టినట్లు ఉండటం విశేషం. దీంతో సోషల్‌మీడియాలో ఈ విషయంపై రచ్చ మొదలైంది. ఇక ఈ కాపీ అనేది కేవలం పోస్టర్‌ వరకేనా.. లేక స్టోరీని కూడా కాపీ కొడుతున్నారా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో రజనీ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా, సామాజిక కార్యకర్తగా కనిపించనున్నాడు. అనిరుధ్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తూ ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్‌ వచ్చింది. 

తాజా సమాచారం ప్రకారం ఇందులో రజనీ తండ్రికొడుకులుగా నటిస్తున్నాడట. ఇప్పటికే రజనీ ఎన్నో చిత్రాలలో తండ్రి కొడుకులుగా నటించి ఉన్నాడు. కానీ ఎక్కువ శాతం చిత్రాలలో తండ్రి పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్‌కే పరిమితమయ్యే చిత్రాలు వచ్చాయి. మరి ఈ చిత్రంలో ఇద్దరు రజనీకాంత్‌లు ఒకే సన్నివేశాలలో కనిపిస్తారా? లేక తండ్రి పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో ఉంటుందా? అనేది తెలియాల్సివుంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. 



By April 18, 2019 at 04:19AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45570/rajinikanth.html

No comments