Breaking News

తగ్గడం తెలిసినోడే తెలివైన వాడు......!


ఇటీవల కాలంలో కోలీవుడ్‌ స్టార్‌ సూర్య సరైన హిట్‌ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. విభిన్న చిత్రాలను చేస్తూ ఉన్నప్పటికీ ఎందుకో గానీ ఆయన చిత్రాలు భారీ విజయాలను సాధించలేకపోతున్నాయి. 24 వంటి విభిన్న చిత్రం కూడా తమిళంలో కంటే తెలుగులోనే మంచి విజయం సాధించింది. అయితే సూర్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఒక సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో సినిమాని లైన్‌లో పెట్టుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ (నంద గోపాలకృష్ణ) చిత్రం చేస్తున్నాడు. ఈమూవీ మే 31వ తేదీన తమిళంతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. 

అదే రోజున విజయ్‌దేవరకొండ-రష్మిక మందన్నలు కలిసి నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం కూడా దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల కానుంది. అయితే సూర్యతో పోలిస్తే ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న విజయ్‌ దేవరకొండ నుంచి సూర్యకి వచ్చే పోటీ మరీ ఇబ్బంది కలిగించేది ఏమీ కాదని చెప్పాలి. మరోవైపు సూర్య ‘ఎన్జీకే’ చిత్రం తర్వాత కె.వి.ఆనంద్‌ డైరెక్షన్‌లో ‘కాప్పన్‌’ మూవీ చేస్తున్నాడు. ఇందులో ప్రధానమంత్రిని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే సెక్యూరిటీ అధికారి పాత్రను సూర్య పోషిస్తున్నాడు. ఇక ఇందులో ప్రధానమంత్రిని చంపడానికి ప్రయత్నించే ఉగ్రవాది పాత్రను ఆర్య పోషిస్తూ ఉండటం విశేషం. మోహన్‌లాల్‌ ప్రధానమంత్రిగా నటిస్తున్నాడు. చాలా ఏళ్ల కిందట ఇలాంటి సబ్జెక్ట్స్‌ని మోహనల్‌లాల్‌, సురేష్‌గోపి, మమ్ముట్టి వంటి వారు మలయాళంలో సినిమాలు తీసి తమ సత్తా చాటారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇలాంటి నేపధ్యం ఉన్న చిత్రాలు రాలేదు. అది ‘కాప్పన్‌’తో నెరవేరనుంది. 

ఇంతకాలానికి సూర్య మరలా ఇదే తరహా స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం దేశభక్తి ప్రధాన చిత్రం కావడం వల్ల స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల చేయాలని తొలుత భావించారు. కానీ అదే తేదీన నేషనల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’ విడుదల కానుంది. ‘సాహో’ చిత్రంపై దక్షిణాది భాషల్లోనే గాక బాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో సూర్య పట్టుదలకు పోకుండా తన చిత్రాన్ని ఆగష్టు 30కి వాయిదా వేసుకున్నాడని తెలుస్తోంది. ఇది ఎంతో తెలివైన నిర్ణయం. ఆగష్టు 30కి ‘సాహో’ విడుదలై ఎలాగూ రెండు వారాలు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో సూర్య కాస్త తగ్గినట్లు కనిపించినా విజ్ఞతతో కూడిన డెసిషన్‌ తీసుకున్నాడనే చెప్పాలి. 

ఇక ఈ చిత్రం తర్వాత సూర్య ‘గురు’ దర్శకురాలు సుధాకొంగర దర్శకత్వంలో ఓ చిత్రం, బాలా డైరెక్షన్‌లో మరో చిత్రం చేయడానికి అంగీకరించాడట. ఇక సుధాకొంగర దర్శకత్వంలో సూర్య నటించబోయే చిత్రం ఫస్ట్‌లుక్‌ని టైటిల్‌తో సహా తాజాగా విడుదల చేశారు. ఈ మూవీకి ‘సురారైపోట్రు’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ‘కాప్పన్‌’లో సూర్యకి జోడీగా సాయేషా సైగల్‌ నటిస్తుండగా, ‘సురారైపోట్రు’లో అపర్ణ బాలమురళిని తీసుకున్నారు. మరి రాబోయే సూర్య చిత్రాలైనా ఆయనకు మరో ‘గజిని’ వంటి బ్లాక్‌బస్టర్‌ని అందిస్తాయో లేదో వేచిచూడాల్సివుంది....! 



By April 18, 2019 at 04:06AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45569/suriya.html

No comments