Breaking News

ఎన్టీఆర్‌, వైఎస్‌ల పోరు కాకతాళీయమా? లేక?


ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో అత్యధికంగా ఎవరు ఉత్తమం అనే ప్రశ్న ఉదయిస్తే దానికి స్వర్గీయ ఎన్టీఆర్‌, స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డిల పేర్లే వినిపిస్తాయి. ఇక బయోపిక్‌గా ‘మహానటి’ విడుదలై అద్భుతమైన విజయం సాధించడం టాలీవుడ్‌లో పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. దాంతోనే బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌కి పూనుకున్నాడు. మరోవైపు ఏకంగా మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టిని ఒప్పించి, పెద్దగా అనుభవం లేని మహి.వి.రాఘవ వైఎస్‌ జీవితంలోని అతి ముఖ్య కీలక ఘట్టమైన పాదయాత్రను కథాంశంగా ఎంచుకుని సెమీ బయోపిక్‌గా ‘యాత్ర’ తీశాడు. 

ఇక విషయానికి వస్తే ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదటి పార్ట్‌ ‘కథానాయకుడు’ సంక్రాంతికి విడుదలై అనూహ్యంగా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక తాజాగా ‘యాత్ర’ చిత్రం కూడా విడుదలైంది. అయితే ‘కథానాయకుడు’ ఓ మోస్తరుగా ఆడినా కూడా ఫిబ్రవరి 8న యాత్ర విడుదలైతే ఫిబ్రవరి 9న ‘మహానాయకుడు’ పోటాపోటీగా విడుదలై ఉండేవి. కానీ ‘కథానాయకుడు’ డిజాస్టర్‌ కావడంతో ఈ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు, రీషూట్స్‌ వంటివి చేస్తున్నారట. 

నిజానికి ఎన్టీఆర్‌ బయోపిక్‌ని ఆయన తనయుడైన బాలకృష్ణ కాకుండా ఇతరులు ఎవరైనా బాగా ఆడేదనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం ‘యాత్ర’లో మమ్ముట్టి వైఎస్‌గా అద్భుతంగా ఒదిగిపోయాడనేది వాస్తవం. ‘మహానాయకుడు’ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో ‘యాత్ర’ చిత్రం సోలోగా విడుదలైంది. కానీ అదే రోజున ఆమెజాన్‌ ప్రైమ్‌ ‘కథానాయకుడు’ చిత్రాన్ని స్ట్రీమింగ్‌లో ఉంచడం విశేషం. మరో విచిత్రం ఏమిటంటే ‘యాత్ర’ హక్కులు కూడా ఆమెజాన్‌ వద్దనే ఉన్నాయి. ఈ విధంగా వెండితెరపై ‘యాత్ర’ , బుల్లితెరపై ‘కథానాయకుడు’ పోటీ పడ్డాయి. 

మరోవైపు ‘మహానాయకుడు’ విడుదల తేదీ ప్రకటిస్తే అదే రోజున ‘యాత్ర’ని ఆన్‌లైన్‌లో పెట్టాలని అమేజాన్‌ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజంగా ఆమేజాన్‌ ముందుగా వేసిన ప్రణాళికలో భాగమా? లేక కాకతాళీయమా? అనేది తేలాల్సివుంది. ఇక ‘మహానాయకుడు’ విడుదల తేదీ ప్రటించిన 24 నిమిషాలలోనే తన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ బయోపిక్‌ ట్రైలర్‌ని విడుదల చేస్తానని, ‘మహానాయకుడు’తో వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పోటీ పడటం కూడా ఖాయమేనని చెప్పాలి. 



By February 10, 2019 at 11:50AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44658/yatra.html

No comments