Breaking News

కోపం ఉన్నా.. నవ్వుతూనే పెళ్లాలపై కౌంటర్!


సినిమా ఫీల్డ్‌ పురుషాధిక్యంతో కొనసాగుతుందనేది నిజం. సినిమా కథ నుంచి బడ్జెట్‌, ప్రమోషన్స్‌ అన్ని హీరోల పేరు మీదనే జరుగుతుంటాయి. అంత మాత్రాన సినిమా ప్రమోషన్స్‌ బాధ్యత కేవలం హీరోలది, దర్శకనిర్మాతలదని భావించడం తప్పే అవుతుంది. హీరోయిన్లు కూడా సినిమా విజయంలో కాకపోయినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తారు. అందునా పరభాషా హీరోయిన్లను బాగా ఎంకరేజ్‌ చేసే మన హీరోలు, దర్శకనిర్మాతలు వారిని ప్రమోషన్స్‌లో భాగం చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. 

ఏకంగా సినిమా విషయంలో ప్రతి విషయంపై ఎంతో పట్టు, ఆర్టిస్టులపై కమాండ్‌ ఉన్న సక్సెస్‌ఫుల్‌ నిర్మాత దిల్‌రాజు విషయంలోనే హీరోయిన్లు ప్రమోషన్స్‌కి హ్యాండిచ్చారంటే పరిస్థితి అర్ధమవుతోంది. ఏదో హైదరాబాద్‌లో జరిగే ఒకటి రెండు ప్రెస్‌మీట్లకు, ఒకటి రెండు ఇంటర్వ్యూలే ప్రమోషన్‌ అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఈ విషయంలో మనం బాలీవుడ్‌ని చూసి ఎంతో నేర్చుకోవాల్సివుంది. 

వారి కాలికి బలపం కట్టినట్లు ప్రతి రాష్ట్ర రాజధానికి వచ్చి మరీ విమానంలో దేశవిదేశాలు చుడుతూ సినిమా విజయం దర్శకనిర్మాతలకు, హీరోలకే కాదు.. హీరోయిన్ల భవిష్యత్తుకి కూడా ఎంతో కీలకం అనే విషయం నిరూపిస్తున్నారు. ఏదో కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ అయిన నయనతారని ప్రమోషన్లకు రాదని చెప్పి మనం ఎండకట్టడం కాదు. అసలు మన ఇండస్ట్రీలో ఏమి జరుగుతుందో చూసుకుంటే పక్కవారిని విమర్శించే ముందు మన డొల్లతనం అర్ధమవుతుంది. 

ఇక విషయానికి వస్తే తాజాగా సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌, మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌లు దిల్‌రాజు నిర్మాతగా, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌) చిత్రంలో నటిస్తున్నారు. ఒకరు సీనియర్‌ స్టార్‌ కాగా మరొకరు యంగ్‌ రైజింగ్‌స్టార్‌. కానీ ఈ వేడుకకు వెంకీ సరసన నటించిన తమన్నా గానీ, వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించిన మెహ్రీన్‌గానీ రాకపోవడం, అందునా ఏపీలో ముఖ్యమైన నగరం అయిన వైజాగ్‌లో జరిగిన వేడుకకు వీరు డుమ్మా కొట్టడం బాధాకరమే. 

ఈ విషయంలో వెంకీ కూడా తన అసహనం ప్రకటించాడు. ఆయన మాట్లాడుతూ, ఫన్‌ వచ్చేలా ‘మేము వచ్చినా.. మా పెళ్లాలు రాలేదు. అది నాకు ఫ్రస్టేషన్‌ తెప్పిస్తుంది..’ అంటూ కాస్త కామెడీగానే అయినా తన ఫన్‌ని ఫస్ట్రేషన్‌తో కలిపి తన అభిప్రాయం వ్యక్తం చేయడం హాట్‌ టాపిక్‌ అయింది. ఇలాంటి హీరోయిన్లని ప్రోత్సహిస్తున్నందుకు, వారిని నెత్తి మీద పెట్టుకుంటున్నందుకు మన వారిని అనాలి మరి. 

ఇప్పటికైనా సినిమాలో నటించాలని అగ్రిమెంట్‌ చేసుకునే సమయంలోనే హీరోయిన్లు కూడా ప్రమోషన్స్‌కి ఖచ్చితంగా రావాలనే కండీషన్‌ని నిర్మాతలు హీరోయిన్ల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంత హీరోలు వచ్చినా గ్లామర్‌ మిస్‌ అయి అభిమానులు ఫస్ట్రేట్‌ కావడం ఖాయమనే చెప్పాలి. 



By January 01, 2019 at 08:51AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44104/venkatesh.html

No comments