Breaking News

బసిరెడ్డికి యంగ్‌టైగరే ధైర్యం చెప్పాడట..!


ప్రఖ్యాత నిర్మాత, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను తమ జగపతి ఆర్ట్స్‌ బేనర్‌లో తీసిన వి.బి.రాజేంద్రప్రసాద్‌ తనయునిగా జగపతిబాబు హీరోగా తెరంగేట్రం చేశాడు. మొదటి చిత్రం కృష్ణంరాజుతో 'సింహస్వప్నం' చిత్రం చేశాడు. ఆ తర్వాత కాలంలో ఫ్యామిలీ హీరోగా 'శుభాకాంక్షలు, శుభలగ్నం, మావిడాకులు, బడ్జెట్‌ పద్మనాభం, ఆహా' వంటి చిత్రాలతో పాటు 'గాయం, సముద్రం, అంత:పురం' వంటి మాస్‌ చిత్రాలతో కూడా అందరినీ మెప్పించాడు. ఇక నటునిగా ఈయన కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణల మాట విని 'లెజెండ్‌' చిత్రంలో పవర్‌ఫుల్‌ పాత్రను పోషించిన విలన్‌గా మెప్పించాడు. అక్కడి నుంచి ఆయన కెరీర్‌ అద్భుమైన మలుపు తీసుకుంది. ఎన్నడు లేనంతగా దాదాపు 25 చిత్రాలు, వివిధ భాషల్లోని మూవీలలో పాత్రలు ఆయన చేతిలో ఉన్నాయి. 

ఇక ఈయన రిచ్‌ బిజినెస్‌మేన్‌గా 'శ్రీమంతుడు', స్టైలిష్‌ విలన్‌గా 'నాన్నకుప్రేమతో' చిత్రాలలో మెప్పించాడు. ఈ ఏడాది 'రంగస్థలం, గూఢచారి, సాక్ష్యం, అరవింత సమేత' చిత్రాలతో అదరగొట్టాడు. ఆయన తాజాగా మాట్లాడుతూ, తనని త్రివిక్రమ్‌కి బసిరెడ్డి పాత్రను ఎన్టీఆరే రికమండ్‌ చేశాడని తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ, నాకు ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లంటే చాలా ఇష్టం. 'అరవింద సమేత' పాత్రను త్రివిక్రమ్‌ అద్భుతంగా రాశాడు. తారక్‌ నన్ను బాగా ప్రోత్సహించాడు. మీరు బాగా చేయగలరు.. మీరు లేనిదే ఈ చిత్రం లేదని ఎన్టీఆర్‌ అనడం నాకు ధైర్యాన్నిచ్చింది. ఆర్టిస్టులంతా ఇగోలు పక్కనపెట్టి కథే హీరో అని భావించి చేయాలి. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ చాలా తెలివిగా తీశాడు. నేను నటుడని. అంతే కానీ విలన్‌ని కాదు. నటుడన్న తర్వాత అన్ని పాత్రలు చేయాలి. ఈ సినమాలో రాయలసీమ యాస నాకు కొత్త. దీని కోసం ఇబ్బంది పడ్డాను. కష్టపడి డబ్బింగ్‌ చెప్పాను. గొంతు నుంచి రక్తం వస్తుందా? అనేంతగా కష్టపడ్డాను. ఇప్పుడు ఆ డైలాగ్స్‌కి మంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. రాయలసీమ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి రాయలసీమలోని అందరికీ చేరువయ్యారు అని ప్రశంసించాడు. 

మారుమూల గ్రామాలలో కూడా అందరు నా పాత్రని బాగా ఇష్టపడ్డారని చెప్పాడు. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. నన్ను విలన్‌ అని పిలవకండి హీరోగా, ఫ్యామిలీ హీరోగా, మాస్‌ హీరోగా కూడా చేశాను. తండ్రి, విలన్‌, సపోర్టింగ్‌ రోల్స్‌ వంటివన్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఎలాంటి పాత్రలు చేయాలో అర్ధం కావడం లేదు. చూద్దాం.. భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వస్తాయో? వెబ్‌సిరీస్‌ కూడా చేయాలని అనుకుంటున్నాను. నటనపరంగా నాకు హద్దులు లేవు. ఒకప్పుడు నటన విషయంలో రాంగోపాల్‌వర్మని సలహా అడిగాను. ఆయన అన్ని రకాల చిత్రాలు చూడమని, చేయమని చెప్పాడు. దాన్నే పాటించాను. ప్రస్తుతం తమిళం, హిందీలలో నటిస్తున్నాను. భాష అనేది నాకు అడ్డంకి కాదు. అన్ని భారతీయ భాషల్లో నటించాలని ఉంది. బెంగాళీలో కాస్త తక్కువ పారితోషికం ఇస్తారు. అయినా మంచి పాత్ర వస్తే అక్కడ కూడా నటిస్తాను. 'సైరా'లో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. అది మీరే చూస్తారు. దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. నేటితరం హీరోలు ఏదో ఒకటి సాధించాలి అనే కసితో పనిచేస్తున్నారు. 'మగధీర' చిత్రంలో నటించడానికి ఎంతో కష్టపడిన రామ్‌చరణ్‌ 'సైరా'కి నిర్మాతగా ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. అలా నేటితరం హీరోలను చూస్తే నాకు సంతోషంగా, ఆనందంగా ఉంది.. అని చెప్పుకొచ్చాడు. 



By October 22, 2018 at 02:45PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43132/jagapathi-babu.html

No comments