Breaking News

నాగార్జున మరో డేరింగ్ డెసిషన్


తెలుగులో నిన్నటి సీనియర్‌ స్టార్స్‌లో ఎక్కువగా మల్టీస్టారర్స్‌, యువహీరోలతో కలిసి పనిచేసిన ఇద్దరే ఇద్దరు వెంకటేష్‌, నాగార్జున. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన సుమంత్‌తో కలిసి 'స్నేహమంటే ఇదేరా', శ్రీకాంత్‌తో 'నిన్నే ప్రేమిస్తా' చిత్రాలలో నటించాడు. మరోవైపు మంచు విష్ణుతో 'కృష్ణార్జున', మోహన్‌బాబు 'అధిపతి'లలో కీలక పాత్రలు చేశాడు. ఇక ఇటీవల ఆయన తమిళ యంగ్‌ స్టార్‌ కార్తితో కలిసి 'ఊపిరి' చిత్రంలో యాక్ట్‌ చేశాడు. ఈ చిత్రం తెలుగునాటే కాదు.. తమిళ నాట కూడా బాగా ఆడింది. ఇక గతంలో నాగార్జున నటించిన 'గీతాంజలి, శివ, రక్షకుడు' వంటి ఎన్నో చిత్రాల ద్వారా ఆయన కోలీవుడ్‌కి కూడా పరిచయం. 

తాజాగా ఈయన శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి 'దేవదాస్‌' చిత్రం చేశాడు. ఇది పెద్దగా కమర్షియల్‌గా వర్కౌట్‌ కాలేదు. ఇక ఇప్పుడు ఆయన మరో కోలీవుడ్‌ యంగ్‌స్టార్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌తో కలిసి మరో చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో పలువురు హీరోలు నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర'తో పాటు, మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి 'మరక్కర్‌' వంటి మల్టీస్టారర్స్‌, మల్టీ లాంగ్వేజస్‌ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇదే సందర్భంగా ఆయన ధనుష్‌ చిత్రంలో కూడా నటించేందుకే ఓకే చెప్పాడు. అదే నిజమైతే ఈ చిత్రం తమిళంలోనే కాదు తెలుగులో కూడా విడుదల కావడం ఖాయమనే చెప్పాలి. 

ఈ మూవీకి 'నాన్‌ రుద్రన్‌' అనే టైటిల్‌ను తమిళంలో టైటిల్‌గా నిర్ణయించారు. తెలుగులో కూడా విడుదల చేసే ఉద్దేశ్యం ఉండటంతో కొంత పార్ట్‌ మూవీని తెలుగులో కూడా చిత్రీకరిస్తారు. త్వరలో తెలుగు టైటిల్‌ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మూవీలో 'స్పైడర్‌' ద్వారా భయంకరమైన విలన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న నటుడు, దర్శకుడు ఎస్‌.జె.సూర్యతో పాటు టాలీవుడ్‌కి బాగా పరిచయం ఉన్న అదితీరావుహైదరి కూడా నటిస్తోంది. 



By October 22, 2018 at 02:35PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43131/nagarjuna.html

No comments