Breaking News

మహేష్‌ జోరు మామూలుగా లేదు!


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు.. ఈయన డేట్స్‌ దొరకడం స్టార్‌ డైరెక్టర్స్‌కయినా కష్టమే. అలాంటిది 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' ద్వారా తనకి మంచి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాలకు పిలిచి మరి పీవీపీ వంటి భారీసంస్థను అప్పగించి 'బ్రహ్మూెత్సవం' చాన్స్‌ ఇచ్చాడు. కానీ శ్రీకాంత్‌ అడ్డాల ఏడెనిమిది మంది రైటర్స్‌తో ఆ కిచిడీ కథను తయారు చేసి బావూరుమనిపించాడు. ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పటి వరకు మరో ఆఫర్‌ రాని శ్రీకాంత్‌ అడ్డాలకు అర్దమై ఉంటుంది. స్టార్‌ హీరోలంటే ఏస్థాయిలో అంచనాలు ఉంటాయి? ఎంత శ్రద్ద పెట్టి, ప్రతి విషయాన్ని తీర్చిదిద్దాలనేది? ఇతర దర్శకులకు కూడా గుణపాఠమే. అయితే ఇలాంటివి వరుసగా ఐదారు కాదు పది ఫ్లాప్‌లు వచ్చినా కూడా ఒక్క బ్లాక్‌బస్టర్‌ ఇస్తే స్టార్‌ హీరోలకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. 

ఇక ఇండియా గర్వించదగ్గ దర్శకుడు మురుగదాస్‌కి చాన్స్‌ ఇచ్చి కోలీవుడ్‌లో కూడా తనని ఎంట్రీ చేయించే బాధ్యతను ఎంతో నమ్మకంగా ఇచ్చాడు. ఆయన కూడా అర్ధం కాని కథతో వచ్చి దెబ్బకొట్టాడు. కానీ మూడో సారి మాత్రం మహేష్‌ తనకి 'శ్రీమంతుడు' వంటి ఆల్‌టైమ్‌ హిట్‌ వచ్చిన కొరటాల శివతో భరత్‌ అనే నేను చేసి అద్భుతమైన విజయమే కాదు.. ఎందరో ప్రముఖులు, రాజకీయ మేధావుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్‌ ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం చేస్తున్నాడు. ఎంతో ఆచితూచి దిల్‌రాజుని అశ్వనీదత్‌తో కలిపాడు. దేవిశ్రీని తీసుకున్నాడు. వంశీపైడిపల్లికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి పూజాహెగ్డేతో జోడీ కడుతున్నాడు. 'మహర్షి' అనే టైటిల్‌ అందులో మహేష్‌ కనిపిస్తున్న డిఫరెంట్‌ లుక్‌లు చూసి అందరు ఫిదా అయిపోతున్నారు. 

ఇక ఇందులో అల్లరి నరేష్‌ కూడా కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ నుంచి సినిమా షూటింగ్‌ కూడా యూఎస్‌లో భారీగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంపై ఉన్న నమ్మకం, సరైన మహేష్‌ చిత్రానికి బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రదర్శించినా వచ్చే టీఆర్పీలు అందరికీ విదితమే. 'అతడు, ఖలేజా, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' వంటి చిత్రాలు ఇప్పటికీ ఆయా రైట్స్‌ కొన్న టివీ యాజమాన్యాలకు కాసుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. దాంతో ఈ చిత్రాన్ని కూడా భారీ ఫ్యాన్సీ ఆఫర్‌తో జెమిని టీవీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ యాజమాన్యం కూడా అఫీషియల్‌గా ప్రకటించింది. మొత్తానికి జయాపజయాలకు అతీతంగా మహేష్‌ చిత్రాలకు బుల్లితెరపై వచ్చే ఆదరణను లెక్కలోకి తీసుకుంటే జెమిని మరో జాక్‌పాట్‌ కొట్టినట్లేనని చెప్పాలి. 



By October 20, 2018 at 10:01AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43095/mahesh-babu.html

No comments