కౌశల్‌ని ఫస్ట్ క్యాష్ చేసుకుంటుంది ఆ స్టారే?
తెలుగు బిగ్‌బాస్ సీజన్2 సంచలనాలకు కేంద్ర బిందువుగా ఇంకా దానిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. విజేత కౌశల్‌కి ఉన్న క్రేజ్ చూసి అందరు ఔరా.. అని నోళ్లు వెల్లబెడుతున్నారు. ఇక కౌశల్ తాజాగా హైదరాబాద్‌లో ఓ వేదికకు వెళ్లితే కొన్ని మైళ్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. ఇవ్వన్నీ ఇచ్చిన ఉత్సాహంతో, కౌశల్ ఆర్మీ నుంచి వస్తున్న మద్దతుతో కౌశల్ నటునిగా కూడా తన కెరీర్‌ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఆయనకు పలు ఆఫర్లు వస్తున్నాయి. ఇక కౌశల్ ఆర్మీ ద్వారా క్రౌడ్ ఫండింగ్ పద్దతితో త్వరలో కౌశల్ హీరోగా ఓ చిత్రం రావడం దాదాపు ఖరారు కానుంది. ఈ సందర్భంలో ఆయన మహేష్ అభిమాని కనుక మొదటి ఛాన్స్ ఆయనకు మహేష్ చిత్రంలోనే ఉండవచ్చని, దిల్‌రాజు-అశ్వనీదత్‌ల భాగాస్వామ్యంలో మహేష్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 25వ చిత్రంలో వంశీపైడిపల్లి ఆయనకోసం ఓ క్యారెక్టర్‌ని తయారు చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పుడు కౌశల్‌ని బోయపాటి-రామ్‌చరణ్‌లు క్యాచ్ చేశారు. చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా రూపొందుతున్న చిత్రంలో కౌశల్‌ని ఓ కీలకపాత్రకి ఎంపిక చేశారట. నెగటివ్ షేడ్స్‌తో ఈ పాత్ర ఉంటుందని అంటున్నారు. బోయపాటి చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలు ఎంత బలంగా ఉంటాయో, వాటిల్లో నటించే వారికి ఎంత పేరు తెస్తాయో తెలిసిందే. ఈ వార్తల నిజా నిజాలపై తాజాగా కౌశల్ స్పందించాడు.
'బోయపాటి-చరణ్ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. అది ఖరారు కాగానే స్వయంగా ఆ విషయాన్ని నేనే చెప్తాను. ఒక సింగిల్ కంటెస్టెంట్‌కి ఇన్ని ఓట్లు రావడం అనేది టీవీ చరిత్రలోనే జరగలేదట. నాకు 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' వారి నుంచి ఫోన్ వచ్చింది. కొంత సమయం తీసుకుని అనౌన్స్ చేస్తామని చెప్పారు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో నాతో పాల్గొన్న వారెవ్వరితో బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా మాట్లాడలేదు. హౌస్‌లో నాకు వారు వంట చేసి పెట్టారు కాబట్టి వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుతాను' అని చెప్పాడు. మహేష్ చిత్రంలో ఈయనకు ఛాన్స్ వచ్చినా కూడా 'మహర్షి' కంటే చరణ్ చిత్రమే ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి కౌశల్ మనకి బిగ్‌స్క్రీన్‌పై పెద్ద స్టార్ చిత్రంలో కనిపించే చిత్రం బోయపాటి-చరణ్‌లదేనని ఖచ్చితంగా చెప్పవచ్చు.
By October 07, 2018 at 04:58PM
Read More
No comments