Breaking News

Ukraine Crisis ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఎన్నటికీ విజేత కాదు: జో బైడెన్


ఉక్రెయిన్‌పై దండయాత్రకు ఉసిగొల్పిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్ ఎప్పటికీ విజేత కాలేడని బైడెన్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్ వద్ద జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యా దండయాత్రలో చిక్కుకున్న పౌరుల దుస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికితోంది.. ఉక్రెయిన్‌‌తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎప్పటికీ విజయం దక్కదని బైడెన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సంఘర్షణ ఒక భయంకరమైన మూల్యం.. ఇప్పటికే రెండు మిలియన్ల శరణార్థులను సృష్టించిందని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రష్యా భయంకరమైన మూల్యమే చెల్లించుకుంటుందని ఇప్పటికే స్పష్టమవుతోంది.. ఉక్రెయిన్ పుతిన్‌కు ఎప్పటికీ విజయం కాదు పుతిన్ బహుశా ఓ నగరాన్ని స్వాధీనం చేసుకుని ఉండొచ్చు.. కానీ, ఓ దేశాన్ని ఆయన ఎప్పటికీ హస్తగతం చేసుకోలేరు’’ అని బైడెన్ అన్నారు. యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభంపై బైడెన్ స్పందిస్తూ.. తమ మిత్ర దేశాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ఐరోపా దేశాలే శరణార్థుల సంరక్షణ బాధ్యత పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదని, తాము కూడా ఇందులో భాగస్వాములు అవుతాం’’ అని అన్నారు. పుతిన్ యుద్ధం మహిళలు, చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ అపారమైన బాధ, అనవసరమైన ప్రాణనష్టం కలిగించిందని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే, ఎంత ఖర్చయినా తన హంతకుల బాటలోనే కొనసాగాలని పుతిన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. రష్యా దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినా పుతిన్ వెనక్కు తగ్గడంలేదు. అయితే, యుద్ధ భూమిలో చిక్కుకున్న పౌరుల తరలింపునకు నాలు నగరాల్లో మానవతా కారిడార్లు ప్రారంభానికి రష్యా అంగీకరించింది. కానీ, అనేక నిష్క్రమణ మార్గాలు రష్యా లేదా దాని మిత్రదేశం బెలారస్‌లోకి వెళుతున్నందున ఈ కారిడార్‌లను పబ్లిసిటీ స్టంట్‌గా ఉక్రెయిన్ ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. యుద్ధం భయంతో ఇప్పటి వరకూ ఉక్రెయిన్ నుంచి 2 మిలియన్ల మంది దేశం విడిచి వెళ్లారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఐరోపా నుంచి ఇంత పెద్ద సంఖ్యలో శరణార్ధులుగా మారడం ఇదే తొలిసారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా నుంచి గ్యాస్‌, ముడి చమురు దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. ఈయూ మిత్ర దేశాలు ఈ విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవని, మిత్ర దేశాల పరిస్థితులను తాము అర్ధం చేసుకోగలమని పేర్కొన్నారు. క్రెయిన్‌కు అండగా ఉంటూ నిధులు అందిస్తామని బైడెన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక, భద్రత, మానవతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బైడెన్‌ తెలిపారు. చమురు దిగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు.


By March 09, 2022 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ukraine-will-never-be-a-victory-for-putin-says-us-president-joe-biden/articleshow/90092942.cms

No comments