Russian Invasion యుద్ధం ఇష్టలేక సొంత వాహనాలను ధ్వంసం చేస్తున్న రష్యా సైన్యం.. వీడియోలు వైరల్
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ స్వదేశంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నిరసన సెగలు తగులుతున్నాయి. పెద్ద ఎత్తున రష్యన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. యుద్ధంలో పాల్గొన్న ఓ రష్యా సైనికుడు తన తల్లికి పంపిన చిట్ట చివరి సందేశం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ప్రవేశించిన ... అక్కడ తమ సొంత వాహనాలను ధ్వంసం చేస్తున్నట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని వెలువరించింది. ఉక్రెయిన్ ప్రజలపై దాడి చేయడం ఇష్టంలేని రష్యన్ సైనికులు కన్నీరు పెట్టుకుంటున్నారని, యుద్ధాన్ని తప్పించేందుకు తమ వంతుగా వాహనాలను తగులబెడుతున్నారని పేర్కొంది. అమెరికా రక్షణశాఖ కార్యాలయానికి చెందిన ఓ అధికారిని ఉటంకిస్తూ ఈ విషయాలను వెల్లడించింది. ‘‘రష్యా సైనికుల్లో చాలామంది యువతే ఉన్నారు.. వీరికి తగినంత శిక్షణ లేదు.. పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం కాలేదు.. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. వాహనాలకు సరిపడా ఇంధనం కూడా వారి దగ్గర లేదు.. యుద్ధాన్ని నివారించే ఉద్దేశంతో వాహనాలను ధ్వంసం చేస్తున్నారు.. ఉక్రెయిన్‌కు చిక్కిన రష్యన్ సైనికులు ఈ విషయాలు చెప్పారు.. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యన్ కమాండర్లు తమ వ్యూహాలను మార్చే అవకాశముంది’’ అని ఆ కథనం పేర్కొంది. బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ షాడోబ్రేక్ కూడా ఈ వాదనలను బలపరుస్తూ రేడియో సందేశమిచ్చింది. మరోవైపు, ఉక్రెయిన్ పట్టణాలు నాశనమయ్యేలా బాంబులు వేయాలన్న తమ కమాండర్ల ఆదేశాలను యుద్ధ క్షేత్రంలో ఉన్న రష్యన్ సైనికులు ధిక్కరిస్తున్నట్టు డైలీ మెయిల్ రికార్డు చేసిన సందేశాలను బట్టి తెలుస్తోంది. మరోవైపు, సుమీ ప్రాంతంలోని డిపోలో ఉన్న రష్యన్ దళాలు అవుట్‌పోస్ట్‌ను విడిచిపెట్టి రాత్రిపూట అడవుల్లోకి పారిపోయాయని ఉక్రేనియన్ పౌరులు నివేదిస్తున్నారు. BMPలు, BTR-80లు, MT-LBలు, పదాతి దళ రవాణా వాహనాలను వదిలిపెట్టి ఎందుకు పారిపోయాయో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. అలాగే, కొందరు వాహనాలను వదలిపెట్టి వెళ్తుండగా.. కొందరు ఉక్రేనియన్ దళాలకు లొంగిపోతున్నట్లు, వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయివేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, OSINT డిఫెండర్, ఉక్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఆర్మీ ట్వీట్ చేసిన ఫోటోలు రష్యా సైన్యానికి చెందినవిగా పేర్కొంటున్న వాహనాలు నాశనం చేసినట్లు చూపుతున్నాయి. రష్యా బలగాలు సుమీ రీజియన్‌లోని ఔట్‌పోస్ట్‌ను విడిచిపెట్టి, రాత్రి సమయంలో అడవుల్లోకి పారిపోయి, సైనిక వాహనాలను వదిలివేసినట్లు OSINT డిఫెండర్ ట్వీట్ చేసింది. రష్యాకు చెందిన సైనికుడి సందేశాన్ని ఉక్రెయిన్ రాయబారి ఐరాసలో చదివి వినిపించిన విషయం తెలిసిందే. తాము ఉక్రెయిన్‌లోని అన్ని నగరాలపై దాడి చేస్తున్నామని, సాధారణ ప్రజలపై కూడా బాంబులు వేస్తున్నామని, తనకు చాలా భయంగా ఉందని చెప్పాడు. చివరకు ఆ సైనికుడు సైతం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ‘‘అమ్మా నేను ఉక్రెయిన్‌లో ఉన్నాను.. ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది. నాకు చాలా భయంగా ఉంది.. అన్ని నగరాలపైనా బాంబులు వేస్తున్నాం.. సాధారణ ప్రజలను సైతం టార్గెట్ చేస్తున్నాం’’ అని తన తల్లికి రష్యన్ సైనికుడు సందేశం పంపించాడు.
By March 03, 2022 at 08:41AM
No comments