Breaking News

సాంకేతికలోపంతో పొరపాటున పాక్‌లోకి క్షిపణి దూసుకెళ్లింది: భారత కీలక ప్రకటన


భారత నుంచి తమ గగనతలంలోకి సూపర్‌ సోనిక్‌ వేగంతో ‘ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌’ ఒకటి వేగంగా దూసుకొచ్చి కూలిపోయిందని ఆరోపించిన విషయం తెలిసిందే. దీని వల్ల పౌరుల ఆస్తులకు నష్టం వాటిల్లిందని పాకిస్థాన్‌ పేర్కొంది. ఈ ఘటనపై భారత్ తాజాగా స్పందించింది. ప్రయోగించిన క్షిపణి ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌ భూభాగంలోకి దూసుకెళ్లి కూలిపోయిందని తెలిపింది. ఇది సాంకేతిక లోపం వల్లే జరిగిందని, దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని వివరించింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు శుక్రవారం వెల్లడించింది. ‘‘9 మార్చి 2022న సాధారణ నిర్వహణ సమయంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు క్షిపణి దూసుకెళ్లింది.. దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది..ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించింది’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్సుల్లోని ఖానేవాల్ జిల్లా పరిధి మియాన్ చున్నూ నగరంలో పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయమని పేర్కొంది. భారత్ భూభాగం నుంచి బయలుదేరిన క్షిపణి ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో 40 వేల అడుగుల ఎత్తున మా గగనతలంలోకి 100 కి.మీ. మేర దూసుకొచ్చి కూలిపోయిందని పాక్ ఆరోపించింది. ఇందులో ఎటువంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ముప్పు తప్పిందని, అయితే, ఆస్తినష్టం వాటిళ్లిందని తెలిపింది. ఈ ఘటనపై పాక్‌లోని భారత రాయబారిని పిలిపించిన పాక్.. నిరసన తెలియజేసింది. ‘మార్చి 9వ తేదీ సాయంత్రం 6.43గం.లకు భారత్‌లోని సూరత్‌గఢ్‌ నుంచి సూపర్‌ సోనిక్‌ వేగంతో వస్తువు ఒకటి పాకిస్థాన్‌ గగనతలంలోకి దూసుకొచ్చింది.. అదే రోజు సాయంత్రం 6.50గం.ల సమయంలో మియాన్‌ చున్ను నగరం సమీపంలో కూలిపోయింది.. దీనివల్ల పౌరుల ఆస్తులకు నష్టం కలిగింది.. ఈ ఘటనపై పారదర్శకమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశాం.. ఇటువంటి చర్యలతో వాయు మార్గంలో ప్రయాణిస్తున్న విమానాలు ప్రమాదాలకు గురవుతాయి’ అని ఆందోళన వ్యక్తం చేసినట్లు పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ కూడా ఈ ఘటనపై మరో ప్రకటన విడుదల చేశారు. ‘భారత్‌ తరచూ గగనతల పరిధులు ఉల్లంఘిస్తోంది’ అని ఆరోపించారు. ‘వేగంగా దూసుకొస్తున్న వస్తువును మా గగనతల రక్షణ వ్యవస్థ పసిగట్టింది.. భూమికి 40వేల అడుగుల ఎత్తులో 3నిమిషాల 44 సెకన్లలో 124 కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఆ పరికరం ఆ తర్వాత కూలిపోయింది. అది భారత్‌లోని సిర్సా నుంచి బయలుదేరినప్పటి నుంచి మా వాయుసేనకు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ ఆపరేషన్‌ సెంటర్‌ దానిని ట్రాక్‌ చేస్తూనే ఉంది’ అని పాక్ సైనిక అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ బాబర్‌ ఇఫ్తిఖర్‌ తెలిపారు.


By March 12, 2022 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/accidentally-fired-missile-into-pakistan-says-india-defence-ministry/articleshow/90162929.cms

No comments